అప్పటి వరకు తండ్రి ఆటో నడిపితేగానీ.. పూట గడవని పరిస్థితి నుంచి ఒక్కసారిగా హీరో అయిన బౌలర్ ఒకరైతే!
పానీపూరీ అమ్ముకుంటూ పొట్ట పోసుకున్న నూనూగు మీసాల పోరగాడు.. కండ్లు మూసి తెరిచేలోగా కోట్లకు పడగలెత్తాడు!!
ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం రోజు గ్రౌండ్లో దిగేందుకు కనీసం బూట్లు కూడా లేని ఓ ఆటగాడు సీజన్ తిరిగేసరికి కోటీశ్వరుడయ్యాడు!!
వీరంతా ప్రతిభవంతులనడంలో సందేహం లేకపోయినా.. వారికి స్టార్ హోదాను ఇచ్చింది మాత్రం ముమ్మాటికి ఇండియన్ ప్రీమియర్ లీగే. నైపుణ్యానికి నాణ్యత జోడిస్తూ.. దేశవాళీ ఆటగాళ్లను సూపర్ స్టార్లుగా మార్చే పండుగ మరోసారి మన ముందుకు వచ్చింది. ప్రపంచ క్రికెట్ గతిని మార్చిన ఐపీఎల్ మెగా వేలానికి నేడు తెరలేవనుంది. రికార్డు ధర పలికేందుకు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రెడీగా ఉంటే.. ఆ రికార్డులు బద్దలు కొట్టాలని డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న బిగ్ ఈవెంట్లో వందలాది మంది తమ అదృష్టాన్ని పరీక్షంచుకోనుండగా.. లక్ష్మీదేవి కటాక్షం ఎవరికి దక్కుతుందో చూడాలి!
బెంగళూరు: అత్యంత ప్రజాదరణ కలిగిన ఐపీఎల్ మెగావేలానికి రంగం సిద్ధమైంది. కొత్తగా వచ్చిన రెండు జట్లతో కలిసి మొత్తం 10 ఫ్రాంచైజీలు 590 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనుండగా.. రెండు రోజుల పాటు ఈ వేలం కొనసాగనుంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు రికార్డు ధర పలకడం ఖాయమే కాగా.. ఇటీవల బ్యాట్‌తో, బంతితో రాణిస్తున్న శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌కు కండ్లు చెదిరే మొత్తం ఇవ్వడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బలమైన జట్లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న ఫ్రాంచైజీలు వేలంలో అందుకు తగ్గట్లు పావులు కదుపనున్నాయి. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లతో పాటు.. కొత్తగా లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఐపీఎల్-15వ సీజన్లో తమ ప్రణాళికలకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నాయి. అందరికంటే ఎక్కువగా పంజాబ్ కింగ్స్ వద్ద రూ. 72 కోట్లు అందుబాటులో ఉండగా.. శ్రేయస్ అయ్యర్ వంటి ప్లేయర్ కోసం ఆ జట్టు 20 కోట్లు పెట్టేందుకు కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. ఒక్కో జట్టు అత్యల్పంగా 18 మందిని అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోనుండగా.. హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ వంటి వాళ్లు భారీ ధర పలికే చాన్స్‌లు ఉన్నాయి. అంబటి రాయుడు, సురేశ్ రైనా, రాబిన్ ఊతప్ప, దినేశ్ కార్తీక్ వంటి వెటరన్ల నుంచి.. యష్ ధుల్, విక్కీ ఓస్తాల్, రాజ్ బవా వంటి అండర్-19 స్టార్ల వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
విదేశీ స్టార్లు
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి మన ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆటను మలుపుతిప్పగల ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించిన సందర్భాలు కో కొల్లలు. ఈసారి కూడా అలాంటి ఆటగాళ్లకు కొదవలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్దని వదిలేసుకున్న డేవిడ్ వార్నర్ కోసం మూడు నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. విధ్వంసక ఓపెనింగ్‌తో పాటు జట్టును నడిపించిన అనుభవం ఉన్న వార్నర్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డేవిడ్ భాయ్‌తో పాటు క్వింటన్ డికాక్, జాసన్ హోల్డర్, బెయిర్‌స్టో, రాయ్, రబడపై కనక వర్షం తప్పకపోవచ్చు.
సీనియర్లకు చాన్స్ దక్కేనా..
ఐపీఎల్ ప్రారంభం నుంచి వేర్వేరు జట్లతో కొనసాగి.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు దాదాపు దూరమైన దినేశ్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, సురేశ్ రైనా, అంబటి రాయుడు వంటి వారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయా చూడాలి. వీరితో పాటు సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఏ మేరకు అమ్ముడు పోతారనేది ఆసక్తికరం.
అన్క్యాప్డ్ ఆటగాళ్లలో ప్రముఖులు
జాతీయ జట్టుకు ఎంపిక కాకముందే దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో మెరుపులు మెరిపించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆటగాళ్లు వేలంలో కండ్లుచెదిరే ధర దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిలార్డర్లో భారీ షాట్లతో విరుచుకుపడే షారుక్ ఖాన్‌తో పాటు నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, సాయి కిషోర్, రింకు సింగ్ వంటి వారి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే చాన్స్‌లు ఉన్నాయి.
అండర్-19 హీరోలు
ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో.. యువ భారత జట్టును విజేతగా నిలపడంలో కీలకమైన ప్లేయర్లపైనా ఫ్రాంచైజీలు దృష్టి పెట్టనున్నాయి. యష్ ధుల్, షేక్ రషీద్, హర్నూర్ సింగ్, రాజ్ బవా, విక్కీ ఓస్తాల్కు కండ్లు చెదిరే పారితోషకం లభించొచ్చు!
భారత స్టార్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్,
శిఖర్ ధవన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, దీపక్ హుడా.
ఫ్రాంచైజీల వద్ద ఉన్న మొత్తం
ఢిల్లీ 48 కోట్లు
ముంబై 48 కోట్లు
చెన్నై 48 కోట్లు
కోల్‌కతా 48 కోట్లు
గుజరాత్ 52 కోట్లు
బెంగళూరు 57 కోట్లు
లక్నో 59 కోట్లు
రాజస్థాన్ 62 కోట్లు
హైదరాబాద్ 68 కోట్లు
పంజాబ్ 72 కోట్లు