సిద్దిపేట, మే 3: త్వరలో రాష్ట్రంలోని అన్ని సర్కార్ దవాఖానల్లో మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. తద్వారా పేద రోగులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని చెప్పారు. మంగళవారం ఉస్మానియా దవాఖాన ఆర్థోపెడిక్ హెచ్‌వోడీ డాక్టర్ తిమ్మారెడ్డి, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరసుతో కలిసి సిద్దిపేట వైద్య కళాశాల దవాఖానలో మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొన్న రోగులను మంత్రి ఆత్మీయంగా పలుకరించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడు తూ.. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ల్లో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేస్తామని వెల్లడించారు. ప్రైవేట్ దవాఖానల్లో ఈ శస్త్రచికిత్సలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. మోకాళ్ల నొప్పులతో ప్రతి 10 మందిలో ఇద్దరు బాధ పడుతున్నారని చెప్పారు.
నడవలేక, కూర్చోలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ శస్త్రచికిత్సలతో పునర్జన్మ ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో ఉస్మానియా దవాఖాన డాక్టర్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురికి ఆపరేషన్లు చేశారు. త్వరలో అన్ని జిల్లాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి రోగులను గుర్తించి, ఆపరేషన్లు చేస్తామని వెల్లడించారు.
ఆరేండ్లుగా మోకాళ్ల నొప్పులతో నడవలేకపోయిన. రెండేండ్లుగా మొత్తం పనిచేయడం లేదు. కుడికాలు నడవడానికి రాకపోవడంతో మంచానికే పరిమితమయ్యా. సర్కారు దయతో ఆపరేషన్ చేయడంతో నడుస్తున్నా. రాఘవాపూర్‌లో పెట్టిన క్యాంప్‌కు పోయిన. అక్కడ పరీక్ష చేయించుకున్నా. రూపాయి ఖర్చు లేకుండా లక్షల రూపాయల విలువైన ఆపరేషన్ ఉచితంగా చేసిండ్రు. నేడు చాలా సంతోషంగా ఉంది.
-బాపురెడ్డి, ఆపరేషన్ చేయించుకున్న రోగి, సిద్దిపేట