కాకతీయ యూనివర్సిటీలో పీవీ విజ్ఞాన కేంద్రానికి నిధులిస్తాం
అంతర్జాతీయ సదస్సులో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకే
నయీంనగర్, మార్చి 20: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్న పీవీ విజ్ఞాన కేంద్రానికి నిధులు మంజూరు చేస్తామని రాజ్యసభ సభ్యుడు, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే కేశవరావు తెలిపారు. కేయూ సెనేట్ హాలులో ఆదివారం వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అధ్యక్షతన ‘దేశంలో ఉన్నత విద్య, అవకాశాలు, చాలెంజ్స్ అండ్ సొల్యూషన్స్’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కే కేశవరావు మాట్లాడుతూ.. దేశంలో కేవలం మూడోవంతు ప్రజలకు మాత్రమే విద్య అందుబాటులో ఉన్నదన్నారు. అయితే చదువు రాజ్యాంగపు హక్కు అని, ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. నూతన జాతీయ విద్యావిధానం సామాజిక న్యాయంపై దృష్టిపెట్టాలన్నారు. విద్యాభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతులపై మేధావులు చర్చించి పరిషార మార్గాలను చూపాలని కోరారు. సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ జీ హరగోపాల్ మాట్లాడుతూ.. విద్య సామాజిక అవసరాలు తీర్చేలా ఉండాలన్నారు. విశ్వవిద్యాలయాలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నాణ్యమైన విద్యపై దృష్టిపెట్టాలని, నిధులు పెంచాలని హైదరాబాద్ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ డీ నరసింహారెడ్డి అన్నారు. దేశంలో యువత శాతం ఎక్కువని, సౌకర్యాల లేమితో విద్యా వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్నదని కేయూ వైస్ చాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేశ్ తెలిపారు. ఈ సదస్సులో విశ్రాంత ఆచార్యులు, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు ఆచార్య కే మురళీమనోహర్, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య బీ వెంకట్రామ్రెడ్డి, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.