బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్రీడలను ప్రారంభించగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘యువత క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలి. అప్పుడే అర్థవంతమైన జీవితం అవుతుంది. మన సంస్కృతిలో భాగమైన యోగాసన, మల్ఖంబ్ వంటి దేశీయ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం గర్వకారణం’ అని తెలిపారు. పది రోజుల పాటు జరుగనున్న క్రీడోత్సవాల్లో దేశవ్యాప్తంగా 200 యూనివర్సిటీల నుంచి మొత్తం 4 వేల మంది అథ్లెట్లు పాల్గొంటున్నారని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.