మామిళ్లగూడెం, జూన్ 8: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ పురోగతిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పైలట్ ప్రాజెక్టులో ఎంపిక చేసిన చింతకాని మండలంలో 3427 మంది లబ్ధిదారులకు ఇప్పటికే 796 యూనిట్లను గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయడంతో 2 వేల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఐదు నియోజకవర్గాల్లో 483 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు 88 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 200 షీప్ యూనిట్ల గ్రౌండింగ్‌కు వెంటనే చర్యలు చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మిల్క్ యానిమల్స్‌కు సంబంధించి జూలై మొదటి వారంలో కొనుగోలు ప్రక్రియ చేయాలన్నారు. వచ్చే సోమ, మంగళ, బుధవారాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణపై అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే యూనిట్లు ఎంచుకున్న లబ్ధిదారులు డిమాండ్‌కు అనుగుణంగా లాభసాటిగా ఉండే యూనిట్లు గ్రౌండింగ్ మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందనే విషయం స్పష్టంగా వివరించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జడ్పీ సీఈవో అప్పారావు, డీటీవో కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈడీ శ్రీరామ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.