పంట ఉత్పత్తుల నిల్వ కోసం నిర్మిస్తున్న గోదాములు కర్షకులకు ఊరటనిస్తున్నాయి. నాబార్డు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సైంటిఫిక్ గోదాములను నిర్మిస్తున్నది. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ఇబ్బంది తొలగనున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ గోదాములు పూర్తయితే రైతులకు పంట నిల్వకు ఇక్కట్లు పూర్తిస్థాయిలో తొలిగే అవకాశం ఉంది. జిల్లా మార్కెటింగ్‌శాఖ పరిధిలో 57 గోదాములు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నాబార్డు సహకారంతో నిర్మించినవి 15. వీటి నిల్వ సామర్ధ్యుం 60 వేల మెట్రిక్ టన్నులు, నాన్ నాబార్డు సహకారంతో నిర్మించినవి మరో 42 ఉండగా.. వీటి నిల్వ సామర్థ్యం 46,770 మెట్రిక్ టన్నులు. మార్కెట్ల వారీగా పరిశీలిస్తే ఖమ్మంలో 4, మధిరలో 14, నేలకొండపల్లిలో 11, కల్లూరులో 3, వైరాలో 11, ఏన్కూరులో 5, సత్తుపల్లిలో 7, మద్దులపల్లిలో 2 గోదాములు అందుబాటులో ఉన్నాయి.
ఖమ్మం, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లా రైతులకు మరిన్ని గోడౌన్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.కోట్లతో నాబార్డు సహకారంతో తెలంగాణ ప్రభుత్వం సైంటిఫిక్ గోడౌన్ల నిర్మాణాలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం నాబార్డు సహకారంతో నిర్మిస్తున్న ఈ సైంటిఫిక్ గోడౌన్లతో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ఇబ్బంది తొలగనుంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ గోడౌన్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. గిట్టుబాటు ధర లభించని సమయంలో ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అనువైన గోడౌన్లు సరిపడినన్ని లేకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో మార్కెట్లో ఉన్న ధరకే తమ పంట ఉత్పత్తులను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం నిల్వలను సివిల్ సప్లయ్ శాఖ తమ ఆధీనంలో ఉన్న గోడౌన్లలో నిల్వ చేస్తోంది. నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో పౌరసరఫరాలశాఖ కొత్త గోడౌన్ల నిర్మాణాలపై దృష్టి సారించింది.
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న వేర్‌హౌస్ గోడౌన్లతోపాటు మార్కెటింగ్‌శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో కొన్నేళ్లుగా విరివిగా గోడౌన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో పంట ఉత్పత్తులకు అనుగుణంగా గోడౌన్లు అందుబాటులోకి వచ్చినట్లయింది. వేర్‌హౌస్ గోడౌన్లలో ప్రస్తుతం మార్క్‌ఫెడ్ సంస్థ అవసరమైన మొక్కజొన్నలు, సొసైటీలకు అందించాల్సిన ఎరువులు, ఇతర అపరాల పంటను నిల్వచేస్తున్నారు. మార్కెటింగ్‌శాఖ పరిధిలోని గోడౌన్లను ధాన్యం నిల్వలతోపాటు ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు జిల్లా సహకార కార్యాలయం పరిధిలో మరో 76 సొసైటీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సొసైటీకి సొంత భవనంతోపాటు ఎరువులు, విత్తనాలు నిల్వ చేసుకునేందుకు నాబార్డు సహకారంతో సైంటిఫిక్ గోడౌన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటా జిల్లా వ్యాప్తంగా పంట ఉత్పతుల దిగుబడి పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా నిల్వలు చేసుకునేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో రైతులకు కలిసి వచ్చినట్లయింది.
ఎండుమిర్చి నిల్వలకు..
జిల్లాలో ఐదు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో మాత్రమే కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. సత్తుపల్లి, కల్లూరు, ఏన్కూర్ మార్కెట్లలో కోల్డ్ స్టోరేజీలు లేవు. ఖమ్మంలో 14 కోల్డ్ స్టోరేజీల్లో 11.13 లక్షల బస్తాల సామర్థ్యం, మధిరలో 12 కోల్డ్ స్టోరేజీల్లో 11 లక్షల బస్తాల సామర్ధ్యం, నేలకొండపల్లిలో 2 కోల్డ్ స్టోరేజీల్లో కలిపి 2.20 లక్షల బస్తాల సామర్ధ్యం, వైరాలో 6 కోల్డ్ స్టోరేజీల్లో 7 లక్షల బస్తాల సామర్థ్యం, మద్దులపల్లిలో 6 కోల్డ్ స్టోరేజీల్లో 7 లక్షల బస్తాల నిల్వ సామర్ధ్యం ఉంది. మొత్తం ఐదు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 40 కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 42 లక్షల బస్తాల మిర్చిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది.
ప్రతి సొసైటీకి ప్రత్యేక గోడౌన్..
సహకార సంఘాల్లో ఎరువులు, విత్తనాలను నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను నిర్మించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో 76 సొసైటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 12,310 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న 79 గోడౌన్లున్నాయి. టీఎస్ మార్క్‌ఫెడ్ పరిధిలో 6 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఖమ్మం రూరల్ మండలంలో ఐదు గోడౌన్లున్నాయి. తెలంగాణ రాష్ట గిడ్డంగుల సంస్థ పరిధిలో ఖమ్మం రూరల్ మండలంలో 25 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో అతిపెద్ద గోడౌన్లకు సంబంధించి 5 బ్లాక్‌లున్నాయి.
కొనుగోలు కేంద్రాలుగా గోడౌన్లు..
జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానంలోకి కొద్ది రోజుల్లో సైంటిఫిక్ గోడౌన్లు రానున్నాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని వ్యవసాయ మార్కెట్లలో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమల్లోకి వచ్చింది. రైతు తన పంటకు మంచి ధర వచ్చినప్పుడు సొంతంగా ఆన్లైన్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించనున్నారు. రైతులు తమ పంటలను వ్యవసాయ మార్కెట్లకు తీసుకురాకుండా మండల కేంద్రాలు, రెవెన్యూ గ్రామాల్లోకి త్వరలో సైంటిఫిక్ గోడౌన్లు అందుబాటులోకి రానున్నాయి.
మార్కెటింగ్ శాఖ పరిధిలో ఇలా..
జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలో మొత్తం 57 గోడౌన్లు అందుబాటులో ఉండగా.. వాటిలో నాబార్డు సహకారంతో నిర్మించినవి 15 ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 60 వేల మెట్రిక్ టన్నులు, నాన్ నాబార్డు సహకారంతో నిర్మించినవి మరో 42 గోడౌన్లు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 46,770 మెట్రిక్ టన్నులు. మార్కెట్ల వారీగా పరిశీలిస్తే ఖమ్మంలో నాలుగు, మధిరలో 14, నేలకొండపల్లిలో 11, కల్లూరులో 3, వైరాలో 11, ఏన్కూరులో 5, సత్తుపల్లిలో 7, మద్దులపల్లి 2 గోడౌన్లు అందుబాటులో ఉన్నాయి.
నాబార్డు సహకారంతో మరిన్ని నిర్మాణాలు
సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు నాబార్డు ప్రత్యేక రుణాలు అందిస్తోంది. ఇప్పటికే బహుళార్థక సేవల కేంద్రాలు (మల్టీపర్పస్)గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 సొసైటీలను గుర్తించాం. ఎంపికైన సొసైటీలకు గోడౌన్లను నిర్మాణం చేసుకునేందుకు తక్కువ వడ్డీతో నాబార్డు రుణ సదుపాయం కల్పిస్తున్నది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం జిల్లాలో గోడౌన్ల నిర్మాణాలు భారీగా జరిగాయి. తద్వారా రైతుల పంటతోపాటు ఎరువుల, విత్తనాలు నిల్వచేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది.
-కూరాకుల నాగభూషణం, డీసీసీబీ చైర్మన్