భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేస్తామని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన వెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. ఉద్యోగుల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు, రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్టు ఉద్యోగులు ఎదురుచూస్తుండగా బుధవారం వారి స్వప్నం ఫలించింది. వారందరికీ సీఎం కేసీఆర్ తీపికబురు అందించడంతో వారిలో ఆనందం ఆకాశాన్నంటింది. వయోపరిమితి పెంపు నిర్ణయంతో వయోధికులకూ ఆశలు చిగురించాయి. ప్రధానంగా వైద్య ఆరోగ్య, వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమం, పోలీసు, ఆర్డబ్ల్యూఎస్, రవాణా, విద్యుత్‌శాఖల్లో భర్తీకి అవకాశం ఉంది. జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులు భర్తీ కానున్నాయి. దీంతో భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి.
జోనల్ వ్యవస్థతో స్థానికులకే కొలువులు..
సీఎం కేసీఆర్ ముందు చూపుతో పాత జోనల్ వ్యవస్థకు స్వస్తి పలికి కొత్త జోనల్ విధానాన్ని ముందుకు తీసుకువచ్చారు. పాత జోనల్ వ్యవస్థలో ఉద్యోగులు దూరప్రాంతాలకు వెళ్లి కొలువు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో 95శాతం స్థానికులతోనే కొలువుల భర్తీ జరుగనున్నది. కొత్త జోనల్ వ్యవస్థ నిరుద్యోగుల తలరాతను మార్చే విధంగా ఉంది.
వయోపరిమితి పెంపుపై హర్షం..
సీఎం కేసీఆర్ ప్రకటన ప్రకారం భద్రాద్రి జిల్లా స్థాయిలో 1,316 పోస్టులు, జోనల్ స్థాయిలో 2,160 పోస్టులు భర్తీ కవాల్సి ఉన్నది. దీంతో నిరుద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు వయోపరిమితి పెంచడంతో అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో కేవలం 35 ఏళ్ల వరకే ఉద్యోగాలకు అర్హులయ్యారు. కొన్ని ఉద్యోగాలకు కొంత వయో పరిమితి పెంపు ఉండేది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులయ్యారు.
1100 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి..
రెండు దశాబ్దాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడండంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కళాశాలలు, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న 1,100 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. వీరందరి ఉద్యోగాల రెగ్యులర్ కానున్నాయి.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు.
భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,543 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇరిగేషన్‌శాఖలో 19, గిరిజన సంక్షేమశాఖ 20, మార్కెటింగ్‌శాఖ 10, ఐసీడీసీ 34, అటవీశాఖ 150, లేబర్ డిపార్ట్మెంట్ 2, మత్య్సశాఖ 4, వైద్యవిధాన పరిషత్ 18, వైద్యారోగ్యశాఖ 20, రవాణా శాఖ 11, మిషన్ భగీరథ 7, ప్లానింగ్‌శాఖ 6, ఎక్సైజ్‌శాఖ 32, ఎస్సీ డెవలప్‌మెంట్‌శాఖ 5, పంచాయతీరాజ్ 21 ఖాళీలతో పాటు కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయ పరిధిలో అటెండర్ పోస్టులు -2, జూనియర్ అసిస్టెంట్ -1, ట్రాక్టర్ డ్రైవర్ -1, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ -1, సీనియర్ అసిస్టెంట్/ అకౌంటెంట్ -5, జూనియర్ అకౌంటెంట్ -1, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ -1, బోర్వెల్ ఆపరేటర్ -1, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ -1, బిల్ కలెక్టర్ – 4, పబ్లిక్ హెల్త్ వర్కర్లు -47 కలిపి మొత్తం 65 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇండస్ట్రీయల్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ -1, ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ -1, డీవైసీవో -2 ఖాళీలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్యాషియర్ -1, కార్మికశాఖ కార్యాలయంలో అటెండర్ -1, కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ -1, నైట్ వాచ్మెన్ -1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో అన్ని పోస్టులు భర్తీ కానున్నాయి.
చరిత్రలో నిలిచిపోయే రోజు..
కని వినీ ఎరుగని రీతిలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ కృషితో బీడుభూములకు నీరు వచ్చాయి. నిధులన్నీ అభివృద్ధి పనులకు అందుతున్నాయి. ఇప్పుడు నిరుద్యోగ యువత ప్రకటన వచ్చింది. దేశంలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేసే సందర్భంగా ఎక్కడా జరగలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాహసోపేత నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్ వంటి డైనమిక్ లీడర్తోనే సాధ్యం.
– టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
ఎస్సై అవడానికి శ్రమిస్తున్నా..
-కురసం శివాజీ, నిరుద్యోగి, దుమ్ముగూడెం
మాది దుమ్ముగూడెం. అక్కడ చదువుకోవడానికి సరైన వసతులు లేవు. దీంతో భద్రాచలం లైబ్రరీకి వస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. పోలీస్‌శాఖలో ఎస్సై సాధించే దిశగా శ్రమిస్తున్నా. కానిస్టేబుల్ కొలువైనా సాధిస్తా. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం నాకుంది.
నిరుద్యోగ యువతకు శుభవార్త
-చిత్తలూరి గోపాలరావు, నిరుద్యోగి, బుచ్చన్నగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం
సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రకటనతో నిరుద్యోగుల కలలు తీరనున్నాయి. 80 వేలకు పైగా ఉద్యోగాలకు శాఖల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వనుండడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ సార్ నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
కొత్త ఉత్సాహం వచ్చింది..
-మూడ్ నరేశ్, నిరుగ్యోగి, జగన్నాథపురం, భద్రాద్రి జిల్లా
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో నిరు ద్యోగుల్లో కొత్త ఉత్సా హం వచ్చింది. ప్రభుత్వం అన్నివ ర్గాల వారికి వయోపరిమితి పెంచుతుండడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతు న్నాను. ప్రతిరోజు గ్రంథాలయానికి వెళ్లి చదు వుతున్నాను. పోటీ పరీక్షల్లో ఈసారి తప్ప కుండా విజయం సాధిస్తాననే నమ్మకం వచ్చింది.
సీఎం అర్థం చేసుకున్నారు..
కాపు రమ్యకృష్ణ, ఎంబీఏ విద్యార్థిని, కొత్తగూడెం
నిరుద్యోగులను సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. కేవలం ఉద్యోగాల ప్రకటనే కాకుండా వయోపరిమితిని పెంచడం కచ్చితంగా శుభవార్తే. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఎంతోమంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్లు విడుదలైతే ఇక యువతకు మంచిరోజులే.
ఆశలు నెరవేరాయి..
-బండి లక్ష్మణ్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తగూడెం
2000లో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను తీసు కొచ్చాడు. మమ్మల్ని బానిసలుగా చేశాడు. రెండు దశాబ్దాలుగా చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మాకు 12 నెలల జీతం వచ్చేలా బేసిక్ పే చెల్లించింది. మమ్మల్ని ఆదుకున్నది. తాజాగా క్రమబద్ధీకరణ ప్రకటన చేసి సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. ఈ ప్రకటన మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. మా ఆశలు నెరవేరాయి.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
-షాహీన్ బేగం, కాంట్రాక్టు లెక్చరర్, చుంచుపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ
నేను రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు లెక్చరర్‌గా పని చేస్తున్నాను. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు చదువు చెప్తున్నాను. ఇన్నాళ్లకు మా కల ఫలించింది. సీఎం కేసీఆర్ మా ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. ఉమ్మడి పాలనలో మాకు అన్యాయం జరిగింది. కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు.
సంతోషంగా ఉంది..
-రంజిత్, వైద్యారోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగి, కొత్తగూడెం
కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఎన్నో ఏళ్లుగా చేస్తున్నా. చాలీచాలనీ జీతాలతో కాలం వెళ్లదీస్తున్నా. ఎప్పటికైనా మా ఉద్యోగం క్రమబద్ధీకరిస్తారనే నమ్మకంతో పనిచేస్తున్నా. సీఎం కేసీఆర్ మా కలలను నిజం చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. కాంట్రాక్టు వర్కర్లను ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు.
చరిత్రలో నిలిచే ప్రకటన..
-సంకుబాపన అనుదీప్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు, రుద్రంపూర్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గొప్ప శుభవార్త చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల ప్రకటన రాలేదు. రాష్ట్రం వచ్చాక ఇది రెండోసారి ప్రకటన. గతంలో పోలీస్, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలు, ఏవో, ఏఈవో పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం నోటిఫికేషన్లు విడుదలైతే జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల భర్తీ జరుగనున్నది. 95శాతం కొలువులు స్థానికులకే దక్కనున్నాయి.
సీఎం కేసీఆర్ హామీలు నెరవేర్చుతున్నారు..
-కలవల చంద్రశేఖర్, సింగరేణి ఎస్సీ లైజన్ ఆఫీసర్
పోస్టుల భర్తీపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంతోషాన్నిచ్చింది. నీళ్లు, నిధులు, నియామాలు అనే నినాదంతో స్వరాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. నీళ్లు, నిధుల కేటాయింపులో ఇప్పటికే న్యాయం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తాజాగా నిరుద్యోగ యువతకు శుభవార్త అందించారు.
సకల జనుల బంధువు కేసీఆర్..
కంచర్ల సాయి భార్గవ్ చైతన్య, టీఎన్జీవోస్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి
80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్, 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన చారిత్రాత్మకం. కొలువులకు అన్ని కేటగిరీలకు గరిష్ఠంగా పదేళ్ల వయోపరిమితి పెంచినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చారు.
జోనల్ వ్యవస్థతో లాభం..
-ఎన్ఎన్ రాజు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, మణుగూరు
నాడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ సాధించారు. ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధనకు శ్రమిస్తున్నారు. ప్రాజెక్టులు నిర్మించి బీడు భూముల్లో సాగనీరు పారించారు. పంటలను సస్యశ్యామలం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 80 వేల ఉద్యోగాల భర్తీకి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన విడుదల చేశారు.
ఆదివాసీలకు వరం..
-రాజిని వెంకటేశ్వరరావు, ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి
జిల్లా, జోన్, మల్టీజోన్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. ఈ చొప్పున భద్రాద్రి జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులకే ఉద్యోగాలు దక్కనున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవవుతున్న వారికి సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. ప్రకటనపై నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
18 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాం..
-మోదుగు వెంకటేశ్వర్లు, తెలుగు లెక్చరర్, ముదిగొండ
మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారేమోనని 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. 2004లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రూ.5 వేల వేతనానికి ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా. కానీ వేతనం తక్కువ తీసుకుంటున్నా. ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మా బాధను అర్థం చేసుకున్నారు.
కాంట్రాక్టు లెక్చరర్లకు వరం..
-గద్దల విక్రమ్, వృత్తి విద్య కాంట్రాక్టు లెక్చరర్
కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడాన్ని టీవీలో చూసి ఎంతో సంతోషించాం. ఈ ప్రకటన మా లాంటి కాంట్రాక్టు లెక్చరర్లకు వరంలాంటిది. మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ విభాగంలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా 2004 నుంచి పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన ఎంతో ఆనందంగా ఉంది.
యువతలో కొత్త ఆశలు..
-టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు
సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపింది. ఇక ఆలస్యంగా లేకుండా వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించడం హర్షణీయం. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఆదివాసీ జిల్లా అయిన భద్రాద్రిలోనూ జోనల్ వ్యవస్థ అమలైతే 95శాతం మంది ఆదివాసీలకు కొలువులు రానున్నాయి
తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చిన కేసీఆర్
-తాతా మధు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
నిరుద్యోగుల కళ్లల్లో ఆనందాన్ని చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత కార్యాన్ని తెలపెట్టరు. ఒకేసారి 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించడం దేశచరిత్రలోనే ప్రప్రథమం. తెలంగాణ ముఖ చిత్రాన్ని సీఎం కేసీఆర్ తన ఆలోచనలతో, పాలనా దక్షతతో మార్చివేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో వేలాదిమంది ఉద్యోగులకు ఇది పండుగ రోజు.
భారీగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చరిత్రాత్మకం..
సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం హర్షణీయం. తెలంగాణలో ఈ నోటిఫికేషన్ ప్రకటన చరిత్రాత్మకం. 11,039 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం, 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల తెలంగాణ యువతకు ఎంతో ఉపయోగం.
నిరుద్యోగులకు వరం..
కందాళ ఉపేందర్‌రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన చేయడం నిరుద్యోగులకు వరం లాంటిది. వారు మంచిగా చదివి ఉద్యోగాలు సాధించాలి. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులు ఉద్యోగాలకు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది.