ఖమ్మం, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చెందినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. మెట్రో నగరాల్లో నిర్వహించే ప్రాపర్టీ షోలను తొలిసారిగా ఖమ్మం నగరంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు చొరవ తీసుకున్న ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంస్థలను మంత్రి అభినందించారు. ఖమ్మం నగరంలోని రాజ్‌పథ్ ఫంక్షన్ హాలులో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ మాట్లాడారు. జిల్లాలోనే పేరొందిన రియల్ ఎస్టేట్ సంస్థలు, నిర్మాణ సంస్థలతోపాటు, రుణ సదుపాయం కల్పించే బ్యాంకులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంతో వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ రకమైన ప్రదర్శనలతో కొనుగోలుదారులకు నాణ్యమైన సేవలు అందుతాయ ని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ప్రజలకు మరింత దగ్గర కావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నగర మేయర్ పునుకోలు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, నమస్తే తెలంగాణ ఖమ్మం బ్రాంచి మేనేజర్ రేనా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాపర్టీ షోకు విశేష స్పందన
ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన లభించింది. రెండు రోజులపాటు జరిగిన ఈ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండో రోజు ఆదివారం ప్రాపర్టీ షో జనంతో కిటకిటలాడింది. రియల్టర్లు, బ్యాంకర్లు ప్లాట్ల కొనుగోలు, రుణ సదుపాయంపై అవగాహన కల్పించారు.