
తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు.. యాసంగిలో రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని గళమెత్తారు.. బీజేపీ నేతల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.. ధాన్యం కొనుగోలు చేసేవరకు ఉద్యమిస్తామని ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ పిలుపును అందుకున్న గులాబీ నేతలు సోమవారం ‘ఊరూరా చావు డప్పు’ నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రఘునాథపాలెం మండల కేంద్రంలో మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం దిగిరావాల్సిందేనని అన్నారు. పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ రేగా నిరసనలో పాల్గొన్నారు. సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య తల్లాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రింగ్ సెంటర్లో ప్రధా నమంత్రి మోదీ శవయాత్ర నిర్వహించారు. మధిరలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, అశ్వారావుపేటలో శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు, కూసుమంచిలో శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి, ఇల్లెందులో శాసనసభ్యురాలు బానోతు హరిప్రియానాయక్, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కొత్తగూడెంలో టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు నిరసనలో పాల్గొన్నారు.
రఘునాథపాలెం, డిసెంబర్ 20: ధాన్యం కొనే వరకూ కేంద్రంపై యుద్ధమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. పంజాబ్ నుంచి రెండు సీజన్ల పంటలనూ కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఊరూరా చావుడప్పు’ నిరసనలో భాగంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఆందోళనలో మంత్రి అజయ్ మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నదాతలకు పిలుపునిచ్చారు. పారాబాయిల్డ్ రైస్‌కు రూపకల్పన చేసిందే ఎఫ్‌సీఐ అని, ఇప్పుడు ఒక్క కిలో కూడా కొనబోమని తెలివిగా చెప్పి తప్పించుకుంటున్నది కూడా కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని స్థిరీకరించారని, దండగ అన్న వ్యవసాయాన్ని నేడు పండుగ చేశారని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతన్నలు పండిస్తున్నారన్నారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రధాన బాధ్యత కేంద్రాదేనన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన కేంద్రంపై మండిపడిన దేశ రైతులు ఢిల్లీలో ధర్నాలు చేస్తే మోదీ సర్కారు దిగొచ్చిందన్నారు. ఆ చట్టాలను వెనక్కుతీసుకొని అన్నదాతలకు క్షమాపణ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టి మనుగడ సాగించిన చరిత్ర లేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పంటల పెట్టుబడికి రాష్ట్ర రైతులకు రూ.50 వేల కోట్లు అందిస్తోందని, దేశంలో ఏ రాష్ట్రమూ ఇంత పెద్ద మొత్తంలో అన్నదాతల కోసం ఖర్చు చేయడం లేదని వివరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం పారిశ్రామిక వేత్తలకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు అబద్ధాలను వల్లె వేస్తూ అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతన విస్మరించిందని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్ర రైతుల సమస్యలను గాలికి వదిలేసినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
రైతుల హక్కులను హరిస్తే ఊరుకోం
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
తల్లాడ, డిసెంబర్ 20: తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుంటే కేంద్రానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ‘ఊరారా చావుడప్పు’ నిరసనలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై రెండు నాలుకల ధోరణి అవలంబిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైనవన్నారు. తెలంగాణకు 50 లక్షల మెట్రిక్ ధాన్యం టార్గెట్ ఇవ్వగా ఇప్పటికే పూర్తయిందన్నారు. ఎమ్మెల్యే సండ్ర సహా టీఆర్ఎస్ నేతలంతా నల్లచొక్కాలు ధరించి, తలపై ధాన్యం బస్తాలు ఎత్తుకొని భారీ ప్రదర్శన చేశారు. ఎడ్లబండ్ల ప్రదర్శన కూడా నిర్వహించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేశారు. రింగ్‌రోడ్డు సెంటర్లో దానిని దహనం చేశారు. అనంతరం అన్నదాతకు ప్రధాని మోది ఉరి వే స్తున్నట్లుగా వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఏఎంసీ వైస్‌చైర్మన్ దూపాటి భద్రరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారపోగు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు శీలం కోటారెడ్డి, కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్‌రెడ్డి, నాయకులు దాసురావు, కోటిరెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం కొనకుంటే ఆందోళన ఉధృతం
‘ఊరూరా చావు డప్పు’ నిరసనలో ఎమ్మెల్యే మెచ్చా
అశ్వారావుపేట, డిసెంబర్ 20: తెలంగాణ రైతుల ధాన్యం కొనకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్ర రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ నేతలు, రైతులు కలిసి సోమవారం అశ్వారావుపేటలో సోమవారం చేపట్టిన ‘ఊరూరా చావుడప్పు’ నిరసనలో ఎమ్మెల్యే మాట్లాడారు. తమ రైతు ప్రభుత్వమని చెప్పకుంటున్న బీజేపీ సర్కారు తెలంగాణ రైతుల నుంచి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. వానకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతును రాజుగా నిలబెట్టేందుకు అనేక పథకాలతో సీఎం కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. దీంతో అన్నదాతలు సంతోషంగా పంటలు చేస్తున్నారన్నారు. దీనిని ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులను దెబ్బతీసేందుకు ధాన్యం కొనుగోలు విషయంలో కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జూపల్లి రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షుడు నూతక్కి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, నాయకులు బండారు శ్రీనివాసరావు, యూఎస్ ప్రకాశ్‌రావు, సత్యవరపు సంపూర్ణ, చందా లక్ష్మీనర్సు, కలపాల శ్రీనివాసరావు, మందపాటి రాజమోహన్‌రెడ్డి, చిన్నంశెట్టి వెంకట నరసింహాం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతుపై కేంద్రానిది వివక్ష
వైరా, డిసెంబర్ 20: యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ‘ఊరూరా చావు డప్పు’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైరాలో జరిగిన నిరసనలో ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపైనా, తెలంగాణ రైతులపైనా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అన్నారు. రాష్ట్ర రైతుల ధాన్యం కొనకుండా వారిని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు రాజకీయంగా దెబ్బతీసేందుకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాలయాపపన చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర రైతులను మోసం చేయాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కేంద్రం ధాన్యం కొనేంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమానికి పిలిపించినా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం ఉండాలని పిలుపునిచ్చారు. మార్క్‌ఫైడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, వైరా పట్టణ అధ్యక్షుడు ధార్నా రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు పసుపులేటి మోహన్‌రావు, కొణిజర్ల జడ్పీటీసీ పోట్ల కవిత, మండల అధ్యక్షుడు యండ్రాప్రగడ మాధవరావు, నాయకులు పోట్ల శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై చూపిస్తున్న వివక్షకు నిరసనగా సీఎం కేసీఆర్ సోమవారం కేంద్రంపై ‘చావు డప్పు’కు పిలుపునిచ్చారు. పిలుపునందుకున్న టీఆర్ఎస్ నేతలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానమంత్రి మోదీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ గళమెత్తారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో జరిగిన నిరసనలో మంత్రి అజయ్‌కుమార్ పాల్గొన్నారు. గులాబీ నేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్రి దమ్ముంటే యాసంగిలో రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేసేలా హామీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్పై ఒంటికాలు మీద లేచే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు రోజుల తరబడి ఆందోళన చేసినా కాంగ్రెసోళ్లు స్పందించలేదని మండిపడ్డారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనలేదన్నారు. బీజేపీకీ అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు.
నియోజకవర్గాల్లో..
సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో తల్లాడలో టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రింగ్ సెంటర్లో ప్రధానమంత్రి మోదీ శవయాత్ర నిర్వహించారు. రైతులు, గులాబీ కార్యకర్తలు నల్లచొక్కాలను ధరించి తలపై ధాన్యం మూటలను పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. రైతుల హక్కులను హరించే హక్కు కేంద్రానికి లేదని, కేంద్ర ప్రభుత్వం బేషరతుగా యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బోనకల్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మధిరలోని వైఎస్సార్ సెంటర్లో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నాయకులతో కలిసి భారీ ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు నాయకులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. పాలేరు నియోజకవర్గంలోనూ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఇల్లెందులో శాసనసభ్యురాలు బానోతు హరిప్రియానాయక్, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లెందు మునిసిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు నిరననలో పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు రేగా కాంతారావు పాల్గొన్నారు. కొత్తగూడెంలో టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు ఆధ్వర్యంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భద్రాచలం నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కొనే దాకా కొట్లాడుడే
కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనేదాకా కొట్లాడుతాం. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇస్తూ రైతుబంధు సహాయం చేస్తుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తూ ధాన్యాన్ని కొనబోమంటూ కొర్రీలు పెట్టడం సరికాదు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం.
ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి
తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రమే కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో రైతులతో పెట్టుకుంటే బీజేపీ ప్రభుత్వం పతనం కాక తప్పదు. రైతులను చిన్నచూపు చూస్తే రైతుల కోపాగ్నికి కేంద్రం ప్రభుత్వ పతనమవుతుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
కేంద్రమే దాన్యం కోనుగోలు చేయాలి
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను విడాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడమే కాక ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇప్పటికైనా రైతులు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాల్సిన సమయం అసన్నమైంది. – అంబటి సుబ్బారావు, రైతు, మద్దులపల్లి
బీజేపీ రైతుల ఉసురు తగులుతుంది..
ఎండనక వాననక చెమట చిందించి రైతులు పంటలు పండిస్తారు. ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నది. కేంద్రానికి రైతులు ఉసురు తప్పక తగులుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెప్తారు. బీజేపీకి శంకరగిరి మాన్యాలే. కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో గద్దెదిగడం ఖాయం.