e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో మరోమాట

ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో మరోమాట

  • కమలం నేతల ద్వంద్వ వైఖరితో ఆగమవుతున్న రైతులు
  • ధాన్యం సేకరణపై కేంద్రం విధానమేంటని నిలదీస్తున్న కర్షకులు
  • పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటానికి అన్నదాతల మద్దతు
  • కేంద్రం దిగొచ్చే వరకూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలంటున్న వామపక్షాలు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. రోజుకో అబద్ధం.. పూటకో మాట మాట్లాడుతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఆరుగాలం కష్టించి సేద్యం చేసే అన్నదాతతో రాజకీయం చేస్తున్నది. ధాన్యం సేకరణపై బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో మరోమాట మాట్లాడుతున్నారు. కమలం నేతలు ఇలా తలోమాట మాట్లాడుతూ అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇష్టారీతిన ప్రకటనలు చేస్తూ ఆగమాగం చేస్తున్నారు. యాసంగి రా రైస్‌ కొనిపిస్తామంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటన చేస్తే.. కేంద్రం మాత్రం ఎఫ్‌సీఐ వద్ద అవసరానికి మించి రా రైస్‌ ఉందని పేర్కొంటున్నది. తీరా పంట పండిన తర్వాత కొనకుంటే పరిస్థితి ఏంటన్నది

- Advertisement -

రైతుల ప్రశ్న..

అసలు డిమాండ్‌ ఇదీ : యాసంగిలో ధాన్యం కొనుగోలు చేస్తారా..? చేయరా..? ఒకవేళ కొనుగోలు చేస్తే ఎంత ధాన్యం సేకరిస్తారు? అనేది స్పష్టత ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. పోడియం వద్ద బైఠాయించి ధర్నా కూడా చేశారు. వీరి పోరాటానికి యావత్‌ రైతాంగం, రైతు సంఘాలు, వామపక్ష పార్టీల నుంచి మద్దతు లభించింది. ఇదే స్ఫూర్తిని కొనసాగించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొంటున్నారు. కాగా, టీఆర్‌ఎస్‌ ఎంపీలు రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తుండడంతో ఓర్చుకోలేని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో అన్నదాతలు కమలం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఖమ్మం, డిసెంబర్‌ 2 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నది. సీఎం కేసీఆర్‌ స్వయంగా రెండుసార్లు ఢిల్లీ వెళ్లి కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రజాపంపిణీ శాఖ పీయూష్‌ గోయల్‌తో సమావేశమైనా ఎలాంటి హామీ ఇవ్వలేదు. బాయిల్డ్‌ రైస్‌ కొనేదిలేదని తెగేసి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు మాత్రం ఇక్కడ కోతలు కోస్తున్నారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తాం.. అని ఒకరంటే.. లేనిపోని ఉపన్యాసాలతో రైతులను రెచ్చగొట్టేవారు ఇంకొకరు. బీజేపీ నాయకుల మాటలపై సాక్షాత్తు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ‘తెలంగాణంలోని బీజేపీ నాయకులు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు..’ అనడం గమనార్హం. పైగా ‘ఎవరి రాజకీయాలు వారికి ఉంటాయి.. మాకూ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి.. ధాన్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం..’ అని సదరు మంత్రి వ్యాఖ్యానించడం గర్హనీయం. ‘పంటల వైవిధ్యం అవసరమే.. అంటారు. కానీ తెలంగాణలో దొడ్డు ధాన్యమే పండుతుందని చెప్తే అర్థం చేసుకోరు. రాజకీయ ప్రయోజనాల కోసం కనికరం లేకుండా.. నిస్సిగ్గుగా మాట్లాడడంపై రైతాంగం మండిపడుతున్నారు.

ఇక్కడి బీజేపీ నాయకుల మాటలు ఇవీ..

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అనేకసార్లు ఉద్యమం చేపట్టింది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును అందుకుని గత నెల 12న ఉమ్మడి జిల్లాలో కేంద్రంపై టీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన గళం విప్పారు. శాసనసభ్యులు, పార్టీ ముఖ్యనేతలు పది నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించారు. ధర్నా తర్వాత మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖమ్మం నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘ధాన్యం కొనుగోళ్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అలాగే బీజేపీ అనుబంధ సంఘమైన కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటి..? యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందా? కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందా..? అనే విషయం తెలుసుకోవాలన్నారు. ఇంకొందరు బీజేపీ నాయకులు రైతులకు బాజాప్తగా యాసంగిలో వరి సాగు చేయాలని చెప్తున్నారు. రైతులు సాగు చేస్తే ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని మాత్రం ఎవరూ చెప్పరు..? బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారో తెలియక రైతులు గందరగోళ పరిస్థితిలోకి వెళ్తున్నారు.

కేంద్రం టార్గెట్‌ చెప్పదు.. కొంటామని అనదు..

సాధారణంగా కేంద్రం ధాన్యాన్ని ఎంత మేరకు కొంటున్నది..? రాష్ట్రం నుంచి ఎన్ని మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించాలి? అనే విషయంపై కేంద్రం ముందే స్పష్టత ఇవ్వాలి. కానీ కేంద్రం ఇప్పుడు కొంటే కొంటామని చెప్తుంది. ఎంతమేరకు కొంటామో ఇప్పుడే చెప్పలేం అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తుంటే బీజేపీ నాయకులు మాత్రం ధాన్యం కొనుగోలుపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. సర్కార్‌ బద్నాం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులు రైతుల పక్షాన నిలబడుతున్నారని బొంకుతూ దొంగ దీక్షలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని మాత్రం నిలదీయరు. మారు మాట్లాడరు.

పండేదే దొడ్డు వడ్లు..

తెలంగాణలో చెరువులు బలోపేతమయ్యాయి. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. సాగునీరు పుష్కలంగా దొరుకుతున్నది. ఇక్కడి భూముల్లో పండేది దొడ్డు రకం వడ్లు. మిల్లులోవ వాటిని ఉడికించి (పార్‌బాయిల్డ్‌) అమ్మితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. కేంద్రం మాత్రం ఉడికించిన వడ్లను కొనలేమని తెగేసి చెప్తున్నది. రైతులు పార్‌బాయిల్డ్‌కు ధాన్యాన్ని మిల్లులకు పంపించలేకపోతే వాటిని మామూలుగానే పట్టించాలి. అలా చేస్తే క్వింటాకు 30 40 నుంచి కిలోల వరకు నూకలే వస్తాయి. రైతులు నష్టపోతున్న దానిని ఎవరు? ఎలా? భర్తీ చేస్తారన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement