
ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని, అందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో విద్య, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలశాఖలతో పాటు ఇతర ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు తరగతులు నిలిచిపోయాయని, విద్యార్థులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాసంస్థలను పునఃప్రారంభించిందన్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. పరిషత్ సమావేశాలకు మండల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయాలన్నారు.
మామిళ్లగూడెం, నవంబర్ 2: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో విద్యాశాఖ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలశాఖతో పాటు ఇతర ఇంజినీరింగ్ శాఖలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా ఏడాదిన్నర పాటు తరగతులు నిలిచిపోయాయనని, విద్యార్థులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాసంస్థల పునః ప్రారంభించిందన్నారు. విద్యారంగంపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కాలంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించినందున ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ల నుంచి కొందరు ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు పంపించామన్నారు. విద్యార్థుల హాజరు నమోదు శాతాన్ని బట్టి ఉపాధ్యాయులను కేటాయించామన్నారు. వారిని తిరిగి పాత పాఠశాలలకు తిరిగి పంపించామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నారు. అందుకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత సమస్య లేదన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు శాసనసభ్యుల సీడీపీ నిధుల నుంచి ఏటా రూ.2 కోట్లు వినియోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి రూ.10 కోట్ల ఎమ్మెల్యేల పరిధిలో సీడీపీ నిధులు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 8.67 లక్షల మంది మొదటి డోసు, 3.50 లక్షల మందికి రెండో డోసు అందిందన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమైందన్నారు. మరో 1.50 లక్షల మందికి టీకా అందాల్సి ఉందన్నారు. ఓటరు జాబితా ప్రకారం ఇంటింటి సర్వే నిర్వహించి కేవలం ఒక్క నెలలోనే 2 లక్షల మందికి టీకా వేశామన్నారు. ఇప్పటివరకు అసలు టీకా తీసుకోని వారిని గుర్తించి వారికి టీకా ఇస్తామన్నారు. వందశాతం వ్యాక్సినేషన్ సాధిస్తామన్నారు.
విద్యార్థుల సంఖ్య పెరిగింది.. : జడ్పీ చైర్మన్ కమల్రాజు
కరోనా కారణంగా సుదీర్ఘకాలం తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయన్నారు. ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి ఉపాధ్యాయుల లోటును భర్తీ చేయాలన్నారు. మండల పరిషత్ సమావేశాలకు మండల అధికారులు తప్పని సరిగా హాజరయ్యే విధంగా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయాలన్నారు. అనంతరం డీఈవో యాదయ్య విద్యాశాఖ నివేదికను సమర్పించారు. విద్యాశాఖలో పురోగతిని వివరించారు. జిల్లాలో 11600 మంది బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయులకు టీకా ఇప్పించామన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 80,974 మంది విద్యార్థులకు 5 లక్షలకు పాఠ్య పుస్తకాలు అందించామన్నారు. 14 కస్తూర్బా విద్యాలయాల్లో 4,300 మందికి తరగతులు జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది 18,207 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. రఘునాథపాలెం మండలంలోని పువ్వాడ నగర్, వైఎస్సార్ నగర్, ఖమ్మం అర్బన్ మండలంలోని టేకులపల్లి ఆవాస ప్రాంతాల్లో నూతనంగా పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వివరించారు. ఉపాధి పథకం కింద 388 వైకుంఠధామాలు, 129 రైతువేదికలు, 586 సీసీ రోడ్లు, పీఎంజీఎస్వై కింద 12 రహదారులు, జిల్లా పరిషత్ సాధారణ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో 1,081 అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, డీఆర్డీవో విద్యాచందన, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రమౌళి, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శ్యాంప్రసాద్, యుగేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాలతి, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి జ్యోతి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.