హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : భూమి బదలాయింపునకు సంబంధించి ఆగ్రోస్, తెలంగాణ గిడ్డంగుల సంస్థ మధ్య మంగళవారం కీలక ఒప్పందం(ఎంవోయూ) కుదరింది. ఈ ఒప్పందం మేరకు మౌలాలిలో ఆగ్రోస్కు చెందిన 23 ఎకరాల భూమిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింది. ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమక్షంలో జరిగిన ఒప్పందంపై ఆగ్రోస్ ఎండీ రాములు, గిడ్డంగుల సంస్థ ఎండీ లక్ష్మి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 23 ఎకరాల ప్రభుత్వ భూమిలో టీజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సొంత నిధులతో 85 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక గిడ్డంగులను నిర్మించనున్నది. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఈ గిడ్డంగులు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.
రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి, పంటల సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలు, భూసారం పెంపు చర్యలు, అధిక ఆదాయం వచ్చే పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పచ్చిరొట్ట, జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేస్తున్నట్టు తెలిపారు. పచ్చిరొట్ట వాడకంతో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.