హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : నేటి యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్ని అయినా అందుకోవచ్చని రుషి నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కొనియాడారు. ఎప్‌సెట్‌లో 156.63 మారులతో రాష్ట్రస్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించిన చిలుకానగర్ డివిజన్‌కు చెందిన కొండల్‌రెడ్డి కుమార్తె మల్లాడి రుషిని ఆయన అభినందించారు. నానక్‌రామ్‌గూడలోని కేటీఆర్ నివాసంలో మంగళవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు లక్ష రూపాయల చెకు అందజేశారు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే మొదటిస్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని, రుషి విజయం డివిజన్‌తో పాటు ఉప్పల్ నియోజకవర్గానికే గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. రుషి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలువాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బన్నాల గీతప్రవీణ్ ముదిరాజ్, మీర్‌పేట హౌసింగ్ బోర్డు డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, పార్టీ నాయకులు సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.