Hamas | జెరూసలేం, ఫిబ్రవరి 17: ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. దాదాపు రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న గాజాను వదులుకునేందుకు హమాస్ సిద్ధపడింది. గాజా పరిపాలనను పాలస్తీనియన్ అథారిటీ(పీఏ)కు అప్పగించేందుకు హమాస్ అంగీకరించినట్టు స్కైన్యూస్ అరేబియాలో ఒక కథనం ప్రచురితమైంది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధ విరమణకు మధ్యవర్తిగా ఉన్న ఈజిప్ట్ ఒత్తిడి మేరకు హమాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
అయితే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం భిన్నంగా స్పందించారు. యుద్ధం ముగిసిన తర్వాత గాజాలో హమాస్, పాలస్తీనియన్ అథారిటీ ఉండదని ఆయన సోమవారం మరోసారి స్పష్టం చేశారు. ప్రజలను ఖాళీ చేయించి, గాజాను పునర్మించాలనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికకు కట్టుబడి ఉంటామని తెలిపారు. 2007 నుంచి గాజా హమాస్ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం గాజాలో పోలీస్, ఆరోగ్య, పౌర సేవలు హమాస్ నియంత్రణలో ఉన్నాయి. కాగా, పాలస్తీనా ప్రభుత్వంగా పీఏను అంతర్జాతీయ సమాజం గుర్తించింది. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ ప్రాంతం పీఏ పరిపాలనలో ఉంది.