Kethireddy Pedda Reddy | వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. అన్ని అవాంతరాలు దాటుకుని సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని మరీ ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ జేసీ ప్రభాకర్ రెడ్డితో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చాలా రోజులుగా గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 15 నెలలుగా కేతిరెడ్డిని తాడిపత్రికి రాకుండా జేసీ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లి, పోరాటం చేసి మరీ ఇవాళ కేతిరెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టారు. 672 మంది పోలీసు బందోబస్తు నడుమ తన ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 15 నెలల తర్వాత తాడిపత్రికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారని పేర్కొన్నారు. పోలీసులకు అన్నివిధాలుగా సహకరిస్తానని చెప్పారు. తాడిపత్రి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.
నాకు ప్రతిపక్షం కొత్త కాదు..పోరాడటం కొత్త కాదు.
ప్రజలకు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అందుబాటులో ఉన్నానో.. ప్రతిపక్షంలో కూడా అలానే అందుబాటులో ఉంటా.
ఈ 15 నెలలు మా నాయకులు మీద అక్రమ కేసులు పెట్టారు..వారి ఇంటికి నేనే వెళ్ళి పరమర్శిస్తా – తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే #PeddaReddy pic.twitter.com/hG7Yp0ggvk
— Anitha Reddy (@Anithareddyatp) September 6, 2025
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయకుండా ఆయన్ను జేసీ అనుచరులు అడ్డుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా కేతిరెడ్డిని వెనక్కి పంపించేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆగస్టు 18వ తేదీన పోలీసులే స్వయంగా కేతిరెడ్డిని తాడిపత్రిలో దించిరావాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ అదే రోజున జేసీ వేరే ఈవెంట్ ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తాడిపత్రికి రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. కేతిరెడ్డిని తాడిపత్రికి రావద్దని ఆదేశించింది. దీనిపై తాజాగా కేతిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డికి అనుమతినిచ్చింది. అవసరమైతే ప్రైవేటు బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఈ క్రమంలో ఆయన భారీ పోలీసుల బందోబస్తు నడుమ తాడిపత్రిలోకి అడుగుపెట్టారు.