Keralam : కేరళ రాష్ట్రం (Kerala state) పేరు ఇక అధికారికంగా కేరళమ్ (Keralam) గా మారనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ పేరుమార్పు ప్రతిపాదనకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రం అనుమతి కోసం కేరళ అసెంబ్లీ (Kerala Assembly) ఇప్పటికే పలుమార్లు తీర్మానాలు చేసి పంపింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో కేరళ పేరుమార్పు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళమ్’ అని పిలిచేవారని గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా గుర్తుచేశారు. రాష్ట్రం పేరు మార్పు విషయంలో విజయన్ ప్రభుత్వానికి బీజేపీ కూడా మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సీఎంకు లేఖ రాశారు. ఆ లేఖకు సీఎం బదులిస్తూ.. ‘రాష్ట్రం అసలు పేరు కేరళమ్. కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారు. వారు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నాం’ అని పేర్కొన్నారు.
ఇదిలావుంటే కేరళ పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంతో.. ఇక రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును ‘కేరళమ్’గా సవరించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో ఈ మార్పులు చేస్తారు.