యాదాద్రి, ఏప్రిల్ 3 : సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతోనే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకొన్నామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన స్తపతు లు, ఇంజినీర్లు, జిల్లా పోలీసు అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇతరులను ప్రభుత్వం తరపున విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా అల్లోల మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారి సేవలు మరువలేనివన్నారు. ఆలయ పునః ప్రారంభం తరువాత పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకొంటున్నారని తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఆధ్యాత్మికతతోపాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనున్నదని ఆయన పేర్కొన్నారు.
గొప్ప దార్శనికుడు కేసీఆర్ : మంత్రి జగదీశ్‌రెడ్డి
అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడించి సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న గొప్ప దార్శనికుడు సీఎం కేసీఆర్ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కొనియాడారు. ఇంతటి గొప్ప దేవాలయాన్ని పునర్నిర్మించిన కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. అంతకుముందు మంత్రులు స్వయంభువులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో ఎన్ గీత తదితరులు పాల్గొన్నారు.