మెట్పల్లి రూరల్, ఆగస్టు 3 : వరద కాలువను జీవనదిలా మార్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట వరదకాలువ వద్ద గల పంపుహౌస్‌ను ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఇటీవల పంపుహౌస్ నుంచి ఎత్తిపోసిన గోదావరి జలాలకు పూజలు చేసి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు గ్రావిటీ ద్వారా నీళ్లు పోతున్నాయని ఓ కాంగ్రెస్ నాయకుడు అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి కూడా కాళేశ్వరంలో ఒక భాగమేనని స్పష్టం చేశారు.
రాంపూర్, రాజేశ్వర్రావుపేట, ముప్కాల్ పంపుహౌస్‌ల ద్వారా వరదకాలువలో నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీని నింపొచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 32 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, అన్నపూర్ణసాగర్కు వంటి జలాశయాల్లో నీళ్లు లేవని తెలిపారు. ఆగస్టు వచ్చినా నాట్లు పూర్తి కాలేదని, పలుచోట్ల నార్లు సైతం ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ నీళ్లు లేకపోయినా మేడిగడ్డ వద్ద ఏడాదంతా నీళ్లు ఉంటాయని, లక్ష్మీబరాజ్ వద్ద ప్రస్తుతం నాలుగు లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నీళ్లు ఎత్తిపోసి జలాశయాలన్నీ నింపాలని కోరారు.