రాచరికపు సరిహద్దులు రజాకారు ఉన్మాదులు
జీ హుజూరు హుకుమ్మతులు చెరసాలల జిందగీలు
చెరిపేసిన జ్ఞాపకాలు విరిచేసిన బంధనాలు
బందూకులు తోకముడిచి పారిపోయిన క్షణం..
బానిస బతుకులలోన ప్రభవించిన ఉషోదయం
సంస్థానపు సంకెళ్లు ఛేదించిన మహోదయం
తెలంగాణ గడ్డపైన తలలెత్తిన ఆత్మబలం
స్వాతంత్య్రపు భావాలకు సమైక్యత అత్తరులు
అలాయీల బలాయీల ఆత్మీయాలింగనాలు..
మతం మరిచి, కులం విడిచి మనుషుల మనసులు కలిసి
ఒక్కటైన శుభ వేళ.. బుక్క, గులాలుల హేల
తరతరాల అభీష్టం తెలంగాణ రాష్ట్రం
అరువదేండ్ల పోరాటం అటకెక్కిన వైనం
ఆశలు అడియాసలై చెదరిపోయిన స్వప్నం..
నైరాశ్యం ఆవహించి నిస్పృహగా మిగులు వేళ
వెలిగిన ఆశాజ్యోతి కలిగించినదొక స్ఫూర్తి
ఉద్యమాన్ని రగిలించి ఉడుకెత్తించిన శక్తి
ఊరువాడలన్నింటిని ఒకటిగ చేసిన యుక్తి
ప్రాణాలకు తెగించి ప్రజలను నడిపిన వ్యక్తి
బాపు కేసియార్ అనే ప్రబలమైనదా శక్తి..
నిద్రాహారాలు మాని నేతగా ముందు నడచి
చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకొని
ప్రత్యేక రాష్ర్టాన్ని బంగరు భూమిగ మార్చే
మహోన్నతమౌ లక్ష్యం సాధనయే సంకల్పం..
అడుగువాడు బడుగువాడు అభివృద్ధిని చెందాలని
అంబేద్కర్ ఆశయాలు అక్షర సత్యం కావాలని
ఆచంద్ర తారార్కం ఆ మహాశయుని స్మరణ
అనునిత్యం జరగాలని ఆ పేరుకు శాశ్వతత్వం
ఆపాదింప జేయాలని ఈ చంద్రుని ఆశయం
ఇదొక నవ్య సంకేతం
అబుల్ హసన్ తానీషా అందించిన ముత్యాలు
భద్రాచల రామయ్య తలనంటిన తలంబ్రాలు
ఆనాటికి ఈనాటికి అలరిస్తవి యేటేటా..
రంజానుల ముబారకులు బక్రీదుల పాయసాలు
జై గణేశ్ నవరాత్రులు దసరాల సరదాలు
దీపావళి సంబరాలు క్రిస్మస్ శుభ సంకేతాలు
ఒకే తోట విరబూసిన రకరకాల పూవులై
స్వతంత్రతా రాగాలకు సమైక్యతా గీతాలై
భరతమాత వదనాన దరహాస చంద్రికలై
బాపూజీ కన్న కలలు మన బాపూ నిజం చేయు
మహాద్భుత భవితవ్యం సాక్షాత్కారం కానున్నది..
జనావళి ఔనన్నది
– శ్రీదేవి మంత్రి
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు