హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)/బొల్లారం: అనారోగ్యంతో మృతి చెందిన తన బావమరిది, జోగినపల్లి శ్రీనివాసరావు పార్థివదేహానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్.. శ్రీనివాసరావు పార్థివదేహం వద్దకు చేరుకొని పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. శ్రీనివాసరావు భార్య, పిల్లలను కేసీఆర్ పరామర్శించారు.
‘మేమంతా అండగా ఉంటాం. ధైర్యంగా ఉండండి’ అని కుటుంబానికి ధైర్యం చెప్పారు. సోదరుడి మృతితో విషాదంలో ఉన్న తన సతీమణి శోభమ్మను కూడా కేసీఆర్ ఓదార్చారు. శ్రీనివాసరావు మృతదేహానికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. మేనమామ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, పలువురు నాయకులు సుచిత్రకు చేరుకొని శ్రీనివాస్‌రావు భౌతికకాయానికి నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం తిరుమలగిరిలోని స్వర్గ వాటికలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు ముగిశా యి. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్, ఎం పీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సబితా ఇం ద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తంచేశారు.