హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రముఖ నటుడు అమితాబచ్చన్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో గురంచి అందరికీ తెలిసిందే. ఎంతో మందిని అలరిస్తున్న ఆ కార్యక్రమంలో అమితాబ్ అడి గే ఒక్కో ప్రశ్నకు సమాధానమిస్తూ కంటెస్టెంట్లు పెద్ద మొత్తంలో డబ్బులు గెల్చుకుంటుంటారు. సరిగ్గా ఇప్పు డు దీన్నే వాడుకొంటూ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘మీకు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చింది’ అం టూ ఫోన్‌కాల్స్, వాట్సప్ మెసేజ్‌లతో ఊదరగొడుతున్నారు. నిజమేనని ఎవరైనా నమ్మితే అసలు మోసానికి తెరతీస్తున్నారు. ‘మీ లాటరీ డబ్బు మీకు రావాలంటే ట్యాక్స్‌లు, ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలి’ అంటూ వేలల్లో డబ్బు దోచుకొంటున్నారు. ఇలాంటి కేటుగాళ్లను నమ్మవద్దని, కౌన్‌బనేగా కరోడ్‌పతి, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ లక్కీడ్రా పేరిట వచ్చే ఫోన్‌కాల్స్ మోసపూరితమని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాటరీ టికెట్ కొనకుండానే లాటరీ ఎలా వస్తుంది? అని మనల్ని మనం ప్రశ్నించుకొంటే ఇలాంటి మోసాల బారిన పడకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు.
వాట్సప్‌కు మెసేజ్‌లు
సైబర్ కేటుగాళ్లు తొలుత మనకు కాల్ చేసి.. ‘మీరు లాటరీ గెల్చుకొన్నారు. మీరేమీ డబ్బులు చెల్లించనక్కర్లేదు. కేవలం మీ ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ను ఫొటోతీసి మేం చెప్పిన వాట్సప్ నంబర్‌కు పంపితే చాలు’ అని అడుగుతున్నారు. వారు అడిగిన వివరాలు పంపగానే మెల్లగా డబ్బుల వ్యవహారానికి వస్తున్నారు. వారి మాటలను నమ్మితే డబ్బులు గుంజుతున్నారని, లేదంటే మనం పంపే డాక్యుమెంట్లను వాడుకుని ఓఎల్ఎక్స్, ఇతర ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో మోసాలకు పాల్పడతున్నారని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.