గాలి వెలుతురు
లోపలికి రానివ్వు
అన్నీ బిగించుకొని
దేన్నీ ఆహ్వానించకుండా
చీకటి గుహలో తచ్చాడకు
ఇక్కడకు ఎలా వచ్చావో
కాస్త జ్ఞాపకం పెట్టుకో
తలపులన్నీ పారేసుకొని
ఏ తలుపుల గుండానో జారిపోకు
నీ ముఖాన్ని అందరూ చూసేటట్టు
కిటికీలు… దర్వాజలు తెరువు
వచ్చేవాళ్ళను రానివ్వు
పోయేవాళ్ళను పోనివ్వు
గవాక్షాలను మూసుకు కూర్చోకు
అనాదిగా స్వేచ్ఛకు బిగించిన
బిరడాలను తొలగించు
మనసు కవాటాలు తెరిచి పెట్టు
కల్మషాలను కడిగేసి
ముఖద్వారాలు ఎప్పుడూ
బార్లా తెరిచే ఉంచు
ఏదో కోల్పోతామన్న భయం వద్దు
తాళాలు తగిలించాల్సింది
గుండె గదులకు కాదని తెలుసుకో
ఓ నిర్మలమైన రాత్రి
నిన్ను చుట్టుకున్న చిక్కుముళ్ళను
పట పటా తెంచుకో
అంతం లేని బాధల సమూహం చివర
ఇంకేదో ఉంటుంది అని వెంపర్లాడకు
బ్రతుకు నేర్పిన పాఠం గొప్పది
తెరువు నీ దేహపు దర్వాజను..!