ఖలీల్‌వాడి, జూలై 23 : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నాచౌక్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విద్యార్థి పోరుకేక సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పర్యటనలు, పోటీలకు ఉన్న నిధులు విద్యార్థులకు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. మొత్తం రూ. 11 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.