హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): పశువుల వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ సేవలు(1962 టోల్‌ఫ్రీ నంబర్) అద్భుతంగా ఉన్నాయని కర్ణాటక పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రభుచౌహాన్ ప్రశంసించారు. ఈ తరహా సేవలను తమ రాష్ట్రంలోనూ అమలుచేస్తామని ప్రకటించారు. అంబులెన్స్‌ల పనితీరును పరిశీలించేందుకు చౌహాన్ నేతృత్వంలోని కర్ణాటక బృందం బుధవారం హైదరాబాద్‌లో పర్యటించింది. కాల్ సెంటర్‌ను, అంబులెన్స్‌ను పరిశీలించింది. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని వెటర్నరీ అంబులెన్స్ సేవలను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయమని చెప్పారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ పథకాలు ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాల గురించి రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కర్ణాటక బృందానికి వివరించారు. పశుసంవర్ధకశాఖ మేనేజింగ్ డైరెక్టర్ రామ్‌చందర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.