Beer | బెంగళూరు, జనవరి 10: కర్ణాటకలో బీర్ల రుచి చేదెక్కనుంది! వాటి ధరల పెంపునకు సంబంధించి శుక్రవారం సిద్ధరామయ్య సర్కారు తుది నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం అంతిమ నిర్ణయం తీసుకొంటే ఈ నెల 20 నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి తిమ్మాపూర్ తెలిపారు. దీంతో ఈ సారి ధరలు పెరిగితే ఏడాది వ్యవధిలో మూడోసారి వినియోగదారులపై కాంగ్రెస్ సర్కారు ధరల భారం మోపినట్టవుతుంది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం ధరలు అమలైతే బీర్ల ధరలు ఏకంగా 10-20 శాతం పెరుగుతాయి. ధరలు ఇలా పెరిగితే తమ వ్యాపారాలు దెబ్బ తింటాయని, దాని ప్రభావం పర్యాటకంపైనా పడుతుందని బీర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి 2023 రాష్ట్ర బడ్జెట్లో బీర్ల ధరలను పది శాతం పెంచడం వల్ల 650 మి.లీ బీర్ సీసా ధర రూ.10-15 పెరిగింది. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో మరోసారి ధరలు 10 శాతం పెంచడం వల్ల అదే బీర్ సీసా ధర రూ.15 పెరిగింది.