Karnataka | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ): ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా చెప్పుకొనే బెంగళూరు నగరానికి క్యూ కడుతున్న కంపెనీల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నది. పెట్టుబడులకు కేరాఫ్‌గా చెప్పుకొనే కర్ణాటక ఇప్పుడు తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతున్నది. బీజేపీ, కాంగ్రెస్‌ల పాలనలో గడిచిన ఐదేండ్ల వ్యవధిలో రాష్ట్రం అధోగతి పాలయ్యింది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
పెట్టుబడులు ఫుల్.. ప్రారంభాలు నిల్
2018 నుంచి 2023 మధ్య రాష్ర్టానికి రూ. 4.29 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా 122 భారీ ప్రాజెక్టులకు ప్రాథమికంగా అనుమతులు లభించాయి. దీంతో దాదాపు 3.52 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అందరూ అంచనా వేశారు. అయితే, అనుమతులు లభించిన ప్రాజెక్టుల్లో కేవలం 38 ప్రాజెక్టులు (31.14 శాతం) మాత్రమే కార్యరూపం దాల్చాయి. మిగతా ప్రాజెక్టులన్నీ అటకెక్కాయి. మరికొన్ని పక్కరాష్ర్టాలకు తరలివెళ్లాయి. ఈ జాబితాలో ఐటీ సేవలు, ఈ-కామర్స్, తయారీ, ఏరోస్పేస్, ఫార్మా తదితర రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నట్టు పారిశ్రామికరంగ నిపుణులు పేర్కొంటున్నారు.
కారణాలు ఇవే..
గత బీజేపీ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి, తుది అనుమతుల్లో తీవ్ర జాప్యం, భూసేకరణ సమస్యలు, పారదర్శకతలేమి తదితర కారణాల వల్లే తొలుత పెట్టుబడులకు సుముఖంగా ఉన్న కంపెనీలు.. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకొన్నట్టు పారిశ్రామికరంగ నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా రూ. 3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు, 2.5 లక్షల ఉపాధి అవకాశాలు కర్ణాటక ప్రజలకు దూరమైనట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.