పదో తరగతి నాటి పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఓ వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తన భర్తతో కలిసి కరీంనగర్లో నివసిస్తోంది. ఆమెకు పదో తరగతిలో పరిచయమైన ఉదయ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని టీజీఎస్పీ ఎనిమిదో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పాత పరిచయంతో ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ ఏడాది మార్చి 3న కరీంనగర్లో ఉదయ్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరిస్తూ పలుమార్లు లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా వీడియోలను బయటపెడతానంటూ బెదిరించి ఈ ఏడాది ఆగస్టు 20, 21 తేదీల్లో తన నుంచి రూ.1.30 లక్షలు తీసుకున్నాడు.
డబ్బులు పంపిన తర్వాత కూడా నిందితుడి నుంచి వేధింపులు ఆగలేదు. యువతి ఇంటికి వచ్చిన ఉదయ్ గొడవ చేయడంతోపాటు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను భర్తకు పంపించాడు. అవి చూసిన భర్త, అతని కుటుంబసభ్యులు సదరు యువతిని ఇంటి నుంచి పంపించేశారు. గర్భిణీగా ఉన్న సమయంలో ఈ వేధింపుల కారణంగా గర్భస్రావం కూడా జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు తొలుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును కరీంనగర్ గ్రామీణ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో కరీంనగర్ గ్రామీణ పోలీసులు నిందితుడు ఉదయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.