గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సామాన్యుడిపై కత్తిగట్టి భారం మోపుతున్న కేంద్రంపై దండెత్తాయి. ఐదు రాష్ర్టాల ఎన్నికలయ్యేదాక నాటకాలాడి.. అయిపోగానే రేట్లు పెంచడంపై ఆగ్రహించాయి. అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వినూత్న నిరసనలతో అట్టుడికించాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించాయి. రోడ్లపై వంటావార్పు చేశాయి. మోదీ సర్కారు దిష్టిబొమ్మలు దహనం చేసి, బీజేపీ వైఖరిని ఎండగట్టాయి. అల్గునూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బూరుగుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎల్ రమణ, కరీంనగర్లో మేయర్ సునీల్‌రావు నిరసన తెలిపారు. ధరలు తగ్గించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
కార్పొరేషన్/గంగాధర/ తిమ్మాపూర్ రూరల్, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ భగ్గుమన్నది. కొన్నాళ్లపాటు ఇంధన ధరలను ఎడాపెడా పెంచుకుంటూ పోతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించింది. ప్రధాన చౌరస్తాల్లో మోడీ సర్కారు దిష్టిబొమ్మలు దహనం చేయడంతోపాటు వంటావార్పులు చేపట్టింది. సిలిండర్లు, వంటచెరుకు పట్టుకొని నిరసన తెలిపింది. రేట్లు తగ్గించాలని, లేదంటే ఇక్కడితో ఆగబోమని స్పష్టం చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని జాతీయ రహదారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అక్కడే వంటావార్పు చేపట్టారు. అంతకుముందు ధరల పెరుగుదలకు నిరసనగా ఎడ్ల బండికి ఆటోను తాళ్లతో కట్టి కిలోమీటరు దూరం లాక్కెళ్లారు. కరీంనగర్లోనూ భారీ ఆందోళనలు చేశారు.
నగరంలోని తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు, మహిళ నాయకురాళ్లతో కలిసి ఖాళీ గ్యాస్ సిలిండర్లను ఎత్తుకొని నిరసన తెలిపారు. అనంతరం భారీ కేంద్ర దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అల్గునూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, వైస్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఆర్బీఎస్ అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్ జగిత్యాల రహదారిపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో, ధర్నా చేశారు. అంతకు ముందు పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఎమ్మెల్యే.. సైకిల్‌పై సమావేశ స్థలానికి వచ్చారు.
వడ్లు కొనేదాకా పోరాటం
కేంద్రం దిగొచ్చి వడ్లుకొనే దాకా పారాటం కొనసాగిద్దాం. మోదీ సర్కారు తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నది. బాయిల్డ్ రైస్ పేరిట తెలంగాణలో వడ్లు కొనకుండా రైతులకు అన్యాయం చేస్తున్నది. పంజాబ్ తరహాలో మన రాష్ట్రంలోనూ ధాన్యం కొనుగోలు చేయాలి. మన రాష్ట్రం నుంచి వెళ్తున్న పన్నులను తిరిగి మనకు ఇవ్వకుండా ఇతర రాష్ర్టాల అభివృద్ధికి కేంద్రం మళ్లిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం మీద చిన్నచూపు చూస్తున్న కేంద్రానికి మన దెబ్బ ఏంటో తెలియాలంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన సెగ తగలాలి.
– కోరుట్ల ఎమ్మెల్యే, జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
పంజాబ్ తరహాలో కొనాలి
తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కేంద్రం కొనేదాకా విశ్రమించేది లేదు. పంజాబ్ కో నీతి.. తెలంగాణకో నీతి లాగా.. కేంద్రం వ్యవహరిస్తున్నది. పంజాబ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేయాలి. తెలంగాణలో రైతు సంక్షేమ ప్రభుత్వం కొనసాగుతున్నది. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టబోతున్నం. గ్రామ పంచాయతీలో తీర్మానాలు, రహదారుల దిగ్బంధం, నిరసన దీక్షలు, రైతుల ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేయడం కార్యక్రమాలను చేపట్టనున్నాం. రైతు రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
– రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్
మరో ఉద్యమంతోనే సమస్య పరిష్కారం
కేంద్రం వడ్లు కొనేదాకా వదిలేది లేదు. మరో ఉద్యమంతోనే సమస్య పరిష్కారమవుతుంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలి. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిర్వీర్యం చేసేందుకు అన్నదాతల పక్షాన టీఆర్ఎస్ పోరాటానికి సన్నద్ధమైంది. దేశంలోనే ఇతర రాష్ర్టాల్లో పంటలను కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో వరిని కొనుగోలు చేయకపోవడం సరికాదు. ధాన్యాన్ని కొనుగోలు చేసేంతవరకు వెనక్కి తగ్గేది లేదు.
– రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య
యాసంగి ధాన్యం కొనాల్సిందే..
కేంద్రం కేవలం బియ్యం కాదు.. ఈ యాసంగి ధాన్యం మొత్తం కొనాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలి. సాగునీటి ప్రాజెక్టులపై ఆంక్షలను ఎత్తివేయాలి. కేంద్ర వైఖరిని నిరసిస్తూ గ్రామ స్థాయి నుంచి పోరాటం చేయాలి. తెలంగాణలో రైతు రాజ్యం తీసుకురావాలని సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు. 24 గంటల కరెంటు, రైతుబంధు, బీమా పథకాలను ప్రవేశపెట్టిన వారి ఇబ్బందులను తీరుస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులను కష్టాల పాల్జేసి రాజకీయ పబ్బం గడుపుకునే యత్నం చేస్తున్నది. ఒకే దేశం ఒకే వ్యవసాయ పాలసీ అవలంబించి పంటలు కొనుగోలు చేయాలి. బీజేపీ దౌర్భాగ్యపు ఆలోచనల వల్ల రైతాంగానికి ఈ సంక్షోభం వచ్చింది.
– కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్‌అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్ అమలు చేయాలి
రాష్ట్రంలో పండించిన ప్రతి గింజనూ కేంద్రమే కొనాలి. లేకుంటే వదిలేదే లేదు. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని తీసుకువచ్చి అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలి. దేశంలో ఉన్న ప్రతి రైతుకు రాజ్యాంగ హక్కు కల్పించాలి. వడ్లు కొనే దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో మాదిరిగా తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనాలి. కొనేదాకా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం.
– ఎమ్మెల్సీ ఎల్ రమణ
రైతులను మోసం చేస్తున్నది
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మోసం చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు వెన్నంటి నిలిచి భరోసానిస్తుంటే.. మోదీ సర్కారు రైతుల నడ్డి విరుస్తున్నది. పంజాబ్ లాంటి రాష్ర్టాల్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ.. మన తెలంగాణకు మొండి చెయ్యి చూపుతున్నది. రాష్ర్టాన్ని కొట్లాడి సాధించుకున్న ఉద్యమ స్ఫూర్తితోనే ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కొట్లాడి తీరుతం. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ చేస్తున్న పన్నాగాన్ని ప్రజల ముందు ఎండగడుతాం. పంజాబ్ తరహాలో తెలంగాణలో పండిన ధాన్యాన్ని వందశాతం కొనుగోలు చేసేందుకు గ్రామాల నుంచి మొదలుకొని జిల్లా వరకు తీర్మానాలు చేయాలని నిర్ణయించాం.
– వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించాలి
రాష్ట్రంలో పండించిన వడ్లు కొనుగోలు చేసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. లేదంటే రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. కేంద్రాన్ని ఒప్పించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయించే దమ్మూ ధైర్యం తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఉందా? ఉంటే నిరూపించుకోవాలి. లేదంటే రైతులతో మరో ఉద్యమం చేస్తం. రైతుల గోసను ఢిల్లీ వరకు వినిపిస్తాం.
– చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
తెలంగాణపై కేంద్రం వివక్ష
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సమస్యలు సృష్టిస్తున్నది. రాష్ట్రంపై వివక్ష చూపుతున్నది. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదే. అయినా పంజాబ్‌కో న్యాయం, తెలంగాణకు మరో న్యాయం అన్న విధానాన్ని అవలంబిస్తున్నది. ఈ వైఖరిని రైతులు ఎండగట్టాలి. నియోజకవర్గంలోని 90వేల మంది రైతులు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు రైతు ఉద్యమం ద్వారా మన రాష్ట్ర హక్కులను సాధించుకోవాలి.
– జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
రైతాంగానికి అండగా నిలుస్తం..
కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. ఇతర రాష్ర్టాలకు ఓ నీతి.. తెలంగాణకు మరో నీతా? బీజేపీ వైఖరిని ఎండగడుదాం. రైతులకు అండగా నిలుస్తం. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకూ ఉద్యమిస్తం. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా రైతులకు మద్దతుగా మరో పోరాటానికి సిద్ధం కావాలి. రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో గ్రామగ్రామాన నల్లజెండాలు ఎగురవేయాలి.
– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్
కర్షక లోకం కదం తొక్కాలి
కష్టపడి పండించిన వడ్లను కేంద్రం కిరికిరి లేకుండా కొనేదాకా కర్షక లోకం తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించాలి. వడ్ల కొనుగోళ్లపై బీజేపీ దమననీతి ప్రదర్శిస్తున్నది. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో రెండు పంటల ధాన్యాన్ని కేంద్ర సర్కారు కొంటే, తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఎందుకు కొనదు? ఇది వివక్ష కాదా?. ఎలాంటి షరతులు లేకుంగా చివరి గింజ వరకూ కేంద్ర ప్రభుత్వమే కొనాలి. ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించినప్పుడు, ఆ ధాన్యం కొనే బాధ్యత కూడా కేంద్రంపై ఉంటుంది. ధాన్యం కొనే వరకు రైతులంతా కదం తొక్కాలి.
– పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది
కేంద్రం తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. కావాలనే వడ్లు కొనకుండా కిరికిరి పెడుతున్నది. పంజాబ్‌లో రెండు పసళ్లు కొంటూ.. ఇక్కడ మాత్రం కొనకుండా రైతులకు అన్యాయం చేస్తున్నది. రైతులకు మేం అండగా నిలుస్తుం. పంజాబ్ తరహాలో వంద శాతం కొనేదాకా ఉద్యమిస్తం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తీర్మానాలు పంపుతం.
– పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్