సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 24: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో దళితబంధు పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి 208 ఎస్సీ కుటుంబాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 207 మందికి ఖాతాలు తెరిచి, ఆన్లైన్లో నమోదు చేశామని చెప్పారు. 186 మంది నుంచి యూనిట్ల ఎంపికకు ఆప్షన్లు అందినట్లు తెలిపారు.
డ్రైవింగ్ అనుభవం ఉన్నవారికి ప్యాసింజర్, గూడ్స్, ట్రాక్టర్లు, కార్లు తదితర వాహనాలు ఇవ్వాలని సూ చించారు. డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లకు అధిక ప్రా ధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. యూనిట్ల ధర అధికంగా ఉన్న చోట సమూహ యూనిట్ గ్రౌండింగ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు యూనిట్ గ్రౌండింగ్, శిక్షణ విషయంలో లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్‌కుమార్, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, డీపీవో రవీందర్, డీఏవో రణధీర్, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, ఆర్టీవో కొండల్రావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రంగారెడ్డి పాల్గొన్నారు.
ప్రణాళికలు రూపొందించండి
బోయినపల్లి, మార్చి 24: మన ఊరు-మన బడి కార్యక్రమంలో సమస్యలు, సౌకర్యాలపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, ఉపాధ్యాయులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం బోయినపల్లి కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసి విద్యా భోధన, సౌకర్యాలను పరీశీలించారు. అనంతరం వెంకట్రావ్పల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ ఛైర్మన్లు, ఏఈలు తయారు చేస్తున్న ప్రణాళికలను పరీశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఈవో రాధాకిషన్ ఎంపీడీవో నల్ల రాజేందర్‌రెడ్డి, సర్పంచులు గుంటి లతాశ్రీ, బూర్గుల నందయ్య ఉన్నారు.