ముకరంపుర, మార్చి 14: శాతవాహన వర్సిటీ ప్రాంతంలో తిరుగుతున్న గుడ్డెలుగును బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాత్రి.. పగలు అన్వేషిస్తున్నా ప్రాంగణంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఆపరేషన్ సజావుగా పూర్తిచేసేలా యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌కు రెండు రోజులు సెలవు ప్రకటించారు.
అయినా గుడ్డెలుగును పట్టుకోవడానికి అనువైన వాతావరణం లేకపోవడం అటవీ శాఖ అధికారులకు సమస్యగా మారింది. రాత్రివేళల్లో ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించినా వసతి గృహాల సమీపంలో ఆ పరిస్థితి కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళ మనుషుల సంచారం, అలికిడిని గుడ్డెలుగు దూరం నుంచే పసిగట్టి తన దారి మార్చుకునే వీలుంది. యూనివర్సిటీలోని నీటి కుంట సమీపంలోని ఆనవాళ్లతో అక్కడ ఓ బోను, కెమెరా ఏర్పాటు చేశారు. అయినా అది మూడు రోజులుగా అటువైపు వచ్చిన దాఖలాలు లేవు.
ఈ పరిసర ప్రాంతాల్లో జనం తాకిడి ఎక్కువ కావడంతో.. అక్కడున్న సహజ ఆనవాళ్లలో వచ్చిన మార్పులను గమనించి దారి మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. స్థావరం సమీపంలోనే గుడ్డెలుగును బంధించడానికి ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే అక్కడి వరకు బోను తరలించడం కొంత కష్టంతో కూడుకున్నది. మరో రెండు మూడు చోట్ల బోన్లు ఏర్పాటు చేసి గుడ్డెలుగును బంధించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇదంతా క్యాంపస్‌లోని వసతి గృహాల నుంచి రాత్రి వేళ మనుషుల అలికిడి, సంచారం లేకుండా ఉంటే తప్ప సాధ్యం కాదని, ఈ దిశగా వర్సిటీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే తప్ప గుడ్డెలుగు బోనుకు చిక్కడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.