ధర్మపురి, మార్చి 13 : ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి రెనొవేషన్ కమిటీ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. నూతనంగా నియామకమైన 13 మంది రెనొవేషన్ కమిటీ సభ్యులకు ఆదివారం దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై అభినందన సమావేశం నిర్వహించగా, మంత్రి వారికి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు.
అనంతరం మాట్లాడుతూ.. దక్షిణ వాహినిగా ప్రవహించే పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న ధర్మపురి క్షేత్రం చారిత్రాత్మకమైందన్నారు. ఇతిహాసాలు, వేదాలకు నిలయమై ఉన్నదనీ, ఇంతటి చరిత్ర ఉన్న దేవస్థానానికి రెనొవేషన్ కమిటీ సభ్యులుగా సేవలందించేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించారని గుర్తు చేశారు. ఇవిగాక 2019లో ముఖ్యమంత్రి ధర్మపురిని సందర్శించిన సందర్భంలో ఎస్డీఎఫ్ కింద రూ.10 కోట్లు కేటాయించారన్నారు. మేజర్ పంచాయితీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి పట్టణాభివృద్ధికి మంత్రి కేటీఆర్ రూ.25కోట్లు కేటాయించారన్నారు.
సింగరేణి నిధులు రూ.6 కోట్లతో మెయిన్ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. కేవలం ధర్మపురిలోనే మొత్తం రూ.141కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పనులు పూర్తయితే ధర్మపురి రూపురేకలు మారతాయన్నారు. ముఖ్యంగా ధర్మపురి దేవస్థాన రెనొవేషన్ కమిటీ సభ్యులు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలన్నారు. దేవస్థాన అభివృద్ధిలో భాగంగా దేవస్థానం చుట్టూ ఉన్న దాదాపు 27 గృహాలకు సంబంధించిన భూమిని తీసుకోబోతున్నామన్నారు. కోనేరు పునరుద్దరణ, ఆలయాల పునర్నిర్మాణం పనులు చేపట్టబోతున్నామన్నారు.
అంతకు ముందు లక్ష్మీనృసింహస్వామి సన్నిధి, అనుబంధ ఆలయాల్లో మంత్రి కొప్పుల పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఈఓ శ్రీనివాస్, బుగ్గారం ఎంపీపీ బాధినేని రాజమణి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, రెనొవేషన్ సభ్యులు ఇందారపు రామయ్య, గందె పద్మ, అక్కనపల్లి సురేందర్, వీరవేని కొమురయ్య, చుక్క రవి, స్తంభంకాడి మహేశ్, ఇనుగంటి రమ, గునిశెట్టి రవీందర్, పల్లెర్ల సురేందర్, గుంపుల రమేశ్, వేముల నరేశ్, జైన రాజమౌళి, సంగం సురేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.