కరీంనగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కమాన్‌చౌరస్తా : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటన నిరుద్యోగులను సంతోషంలో ముంచెత్తింది. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నేరుగా పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టనుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం నియామకాలు చేపట్టనుండగా, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. అయితే, ఈ కొలువుల కల సాకారం కావాలంటే ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అనుకున్న లక్ష్యం కోసం ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం మీ దరిచేరుతుందని చెబుతున్నారు. ఇంత సువర్ణావకాశం మళ్లీ రాదని, విలువైన సమాయాన్ని వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 3,929 లోకల్ కేడర్ పోస్టులు
ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,929 లోకల్ కేడర్ పోస్టులున్నాయి. అలాగే, జోన్-1 కాళేశ్వరం పరిధిలో 1630 ఖాళీలు, జోన్-2 బాసర పరిధిలో 2,328, జోన్-3 రాజన్న పరిధిలో 2,403 ఖాళీలు.. మల్టీజోన్-1 పరిధిలో నేరుగా రిక్రూట్మెంట్ చేసే 6,800 ఖాళీలున్నాయి. గ్రూప్ పోస్టులే కాకుండా కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక అర్హత ఉన్న నిరుద్యోగి 10,668 పోస్టులకు పోటీ పడే చాన్స్ ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యర్థి 9,804, పెద్దపల్లి జిల్లాకు చెందిన అభ్యర్థి 9,230, జగిత్యాల జిల్లాకు చెందిన అభ్యర్థి 10,191 పోస్టులకు పోటీ పడే అవకాశమున్నది. ఇవే కాకుండా గ్రూపుల వారీగా పోస్టులు చూస్తే.. గ్రూప్-1లో 503, గ్రూపు-2లో 582, గ్రూపు-3లో 1373, గ్రూపు-4లో 9,168 ఖాళీలున్నాయి. గతంలో ఏనాడూ ఇంత పెద్ద మొత్తంలో ఖాళీలు చూపలేదు. వీటన్నింటికీ త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నాయి.
మనోళ్లకే అవకాశాలెక్కువ..
ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా లబ్ధి చేకూర్చుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు జోన్ల పరిధిలోని ఇతర జిల్లాలతో పోలిస్తే విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించిన మన జిల్లా బిడ్డలకే అవకాశాలు ఎక్కువగా రానున్నాయి. ఉద్యోగాల భర్తీ మొదలైతే స్థానికంగా ఎక్కువ కొలువులు సాధించే అవకాశాలున్నాయి. ఇక నుంచి మన ఉద్యోగాలు మనకే దక్కుతాయి. జిల్లా, జోనల్, మల్టీ జోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి.
కాళేశ్వరం జోన్..
జోన్ల వారీగా చూస్తే.. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరం జోన్ పరిధిలోకి వెళ్లింది. ఈ జోన్ పరిధిలో ఇంకా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలున్నాయి. అంటే పెద్దపల్లి జిల్లాతో పోలిస్తే మంచిర్యాల మినహా మిగిలిన జిల్లాలు విద్యారంగంలో వెనుకబడి ఉన్నాయి. అంటే ఈ జోన్ పరిధిలో పోస్టులకు పోటీ పడే సమయంలో పెద్దపల్లి నిరుద్యోగులు ఎక్కువగా ఉద్యోగాలు పొందే అవకాశమున్నది. గతంలో పెద్దపల్లి జిల్లా వాసులు జిల్లా, జోనల్ పోస్టుల పరంగా చూసిన బదిలీల విషయంలో చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం జోన్ పరిధి తగ్గింది. ఇప్పడు దూరం కూడా తగ్గింది. అలాగే పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు రైల్వే సౌకర్యం ఉన్నది. ఉద్యోగులు వెళ్లి రావడానికి ఆస్కారముంటుంది. అలాగే ఈ జోన్ పరిధిలోని ఇతర జిల్లాలతో పోలిస్తే.. విద్య, ఉద్యోగాల పరంగానే కాదు, ఏ రంగంలో చూసినా పెద్దపల్లి జిల్లానే ప్రథమ స్థానంలో ఉంది.
రాజన్న జోన్..
ఇక రాజన్న జోన్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలున్నాయి. అదనంగా సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాలున్నాయి. ఉద్యోగాలకు సంబంధించి మిగిలిన జిల్లాలతో పొటీ పడేందుకు సులువుగా ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి. అంతేకాదు.. హైదరాబాద్ కేంద్రంగా ఉండాలనుకునే వారికి ఈ జోన్ చాలా ఉపయోగపడుతుంది. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్ పూర్తయితే.. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాల మధ్యన ప్రయాణం సులువవుతుంది. అప్ అండ్ డౌన్ కూడా ఈజీ అవుతుంది. అంతే కాదు, పిల్లల చదువుల కోసం చాలా మంది ఉద్యోగులు ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. రాజన్న జోన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండి కూడా నిత్యం రాకపోకలు సాగించడానికి అవకాశముంటుంది. గతంతో పోలిస్తే జోన్ వైశాల్యం చాలా తగ్గింది. ప్రధానంగా అన్ని జిల్లాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు రవాణా మార్గాలు ఉన్నాయి.
బాసర జోన్
జగిత్యాల జిల్లా బాసర జోన్ పరిధిలోకి వెళ్లింది. ఈ జోన్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్లుఉన్నాయి. ఒక్క నిజామాబాద్ జిల్లా మినహా మిగిలిన రెండు జిల్లాలతో పోల్చి చూస్తే జగిత్యాల అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంది. విద్యారంగం ముందు నుంచీ ఈ ప్రాంతంలో పటిష్టంగా ఉంది. ఇక్కడి నిరుద్యోగులు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశమున్నది. జోన్ వైశాల్యం భారీగా తగ్గడం వల్ల ఉద్యోగులకు చాలా మేలు చేకూరనున్నది.
ఎలాగైనా ఉద్యోగం సాధిస్తం
నేను పీజీ పూర్తి చేసిన. రైల్వే స్టేషన్ సమీపంలో సెలూన్ షాపు పెట్టుకుని నడిపిస్తున్న. నా భార్య స్వప్న కూడా పీజీ, బీఈడీ పూర్తి చేసింది. మేం కొంతకాలం నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొలువుల కుంభమేళాను ప్రకటించిండు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి. ఇది మాలో కొత్త ఆశలు నింపింది. ఎలాగైనా ఈ సారి ఉద్యోగం సాధిస్తం. నేనూ నా భార్య కొద్ది రోజుల నుంచే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను సెలూన్ షాపులో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటున్న. నా భార్య ఇంటి వద్ద పనులు పూర్తయిన తర్వాత ప్రిపేర్ అవుతున్నది. నిరుద్యోగులకు ఇంత మంచి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– సూత్రాల శ్రావణ్, పీజీ (ఓదెల)
ఉద్యోగ సాధనే నా లక్ష్యం
సాయుధ బలగాలలో సేవ చేయాలనే ఉద్ధేశంతో కరీంనగర్ వచ్చి చదువుకుంటున్నా. కానీ, కేంద్ర ప్రభుత్వ రంగాల్లో పోలీస్, ఆర్మీలో చేరేందుకు గతం కంటే తక్కువ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.
– అశోక్, దుద్దెడ, సిద్ధిపేట
ఒక్కమార్కుతో ఉద్యోగం కోల్పోయా..
గత నోటిఫకేషన్‌లో ఒక్క మార్కుతో కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయా. ఆ తప్పు మళ్లీ చేయవద్దనే ముందు నుంచి ప్రిపేర్ అవుతూ వస్తున్నా. ఇప్పుడు కేసీఆర్ సార్ విడుదల చేసిన నోటిఫికేషన్ చూడగానే పట్టలేని సంతోషం కలిగింది. ఈసారి పరీక్షల్లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చదువుతున్నా. ఉద్యోగంతో ఇంటికి వెళ్లాలన్నదే నా ధ్యేయం.
– జీ మనీష, చిగురుమామిడి
ఇది గొప్ప అవకాశంగా భావిస్తా
చదువుతున్న సమయంలో పోలీస్ కావాలన్నదే నా లక్ష్యం. నేను డిగ్రీ చదువుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల కోసం చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఒక ప్రణాళిక కోసం చదువుతున్నా.
– జ్ఞానేశ్వర్, కామారెడ్డి
ప్రణాళికా ప్రకారం చదవాలి
యువత ఎదురుచూస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80,039 ఖాళీల జంబో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం మంచి కోచింగ్ సెంటర్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకుని ముందుకు సాగాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తేనే విజయం మనదవుతుంది. సమయం వృథా చేయకుండా ఇప్పటినుంచే చదవడం మొదలు పెట్టాలి.
– కే ఉమాప్రసాద్, లక్ష్యం అకాడమీ డైరెక్టర్, కరీంనగర్
రాత పరీక్షపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ముఖ్యంగా రాత పరీక్షపై దృష్టి సారించాలి. పోలీస్ శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. ఇందులో గతంతో పోలిస్తే ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష కంటే రాత పరీక్షకే ప్రాధాన్యత ఉంటుంది. ఇందులోనూ ఆర్థమెటిక్, రీజనింగ్‌లో పట్టు సాధించేలా ప్రాధాన్యతా క్రమంలో పరీక్షలకు సిద్ధమవవ్వాలి. అందులో ఫుల్ మార్కులు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
– నరేశ్, ఆర్థమెటిక్, రీజనింగ్ ఫ్యాకల్టీ
ఎస్ఐ కావాలన్నదే నా కల
ఎస్ఐ పరీక్ష కోసం నాలుగు సంవత్సరాలుగా చదువుతున్నా. గతంలో నిర్వహించిన పరీక్షల్లో 1.5 మార్కులతో ఉద్యోగం సాధించే అవకాశం కోల్పోయా. గతంలో చేసిన తప్పులు చేయకుండా ఈ సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలనుకుంటున్న. దీని కోసం ఒక ప్రణాళిక ప్రకారం చదువుతున్నా.
– కే మౌనిక, కరీంనగర్