న్యూఢిల్లీ: ఫుడ్ బిల్లుపై ఆటోమేటిక్‌గా సర్వీస్ ఛార్జిని విధించడానికి రెస్టారెంట్లకు చట్టపరమైన మద్దతు లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలు వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) తెలిపింది. ఈ నిబంధనను పాటించని రెస్టారెంట్లపై చర్య తీసుకునే అధికారం సీసీపీఏకు ఉందని ఢిల్లీ హైకోర్టు 2025లో తీర్పు చెప్పింది.
10 శాతం సర్వీస్ ఛార్జిని ఆటోమేటిక్‌గా వేస్తున్నారని రెస్టారెంట్లపై నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన సీసీపీఏ స్పందించి, దేశంలోని 27 రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంది. సీసీపీఏ 2022లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సర్వీస్ ఛార్జి గురించి ముందుగా కస్టమర్లకు రెస్టారెంట్లు తెలియజేయాలి. అనంతరం కస్టమర్లు స్వచ్ఛందంగా చెల్లించొచ్చు. కస్టమర్లను బలవంతపెట్టకూడదు. సర్వీస్ ఛార్జిని చెల్లించడానికి తిరస్కరించే కస్టమర్‌ను రెస్టారెంట్లోకి ప్రవేశించకుండా నిరోధించకూడదు, అదేవిధంగా సర్వీస్‌ను నిరాకరించకూడదు. బిల్లులో సర్వీస్ ఛార్జిని కలిపి, దాని మీద మళ్లీ జీఎస్టీని వర్తింపజేయకూడదు.