కలెక్టరేట్/ కమాన్‌చౌరస్తా మార్చి 10: జిల్లాలోని ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయం లో ఏప్రిల్ 8 నుంచి 20 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ ఆదేశించారు. ఉత్సవాలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్‌తో కలిసి గురువారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ 8 నుంచి 20 వరకు బ్రహ్మోత్సవాలు, 10న శ్రీరామనవమి, సీతారాముల కల్యాణోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. 4లక్షలకు పైగా భక్తులు రానున్నందున అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అలాగే, వీఐపీలకు ప్రొటోకాల్ ఏర్పాట్లు చూసేలా రెవెనె న్యూ శాఖ, బారికేడ్లు, క్యూలైన్ ఏర్పాట్లు, కల్యాణ మండప వేదిక పనులను రహదారులు, భవనాల శాఖ అధికారులకు అప్పగించారు.
విద్యుత్ సరఫరా ట్రాన్స్‌కో, తాగునీటి సౌకర్యం కల్పన బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. ఇల్లందకుంటకు కరీంనగర్, హుజూరాబాద్, హన్మకొండ, పరకాల బస్స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు, అనారోగ్యం బారిన పడిన భక్తులకు చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉండాలని, ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖాధికారిని ఆదేశించారు. ఆలయ ఆవరణలోని కోనేరు వద్ద ఐదుగురు గజ ఈతగాళ్లను నియమించాలని, మత్స్యశాఖ అధికారిని, బెల్టుషాపులను నియంత్రించేలా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.
శానిటేషన్ బాధ్య తలను హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ అధికారులకు అప్పగించారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకర ణకు తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖాధికారులను ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఆలయ ఈవో సుధాకర్, అగ్నిమాపక శాఖాధికారి వెంకన్న, డీఎంహెచ్‌వో డా.జువేరియా, ఈఎస్ చంద్రశేఖర్, మత్స్యశాఖాధికారి రాజనర్సయ్య, సివిల్ సైప్లె అధికారి సురశ్రెడ్డి, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.