ఇక కొలువుల జాతర జరుగనుంది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. 95 శాతం స్థానికులకే రిజర్వేషన్లు వర్తిస్తాయని, అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. వయోపరిమితి కూడా పెంచుతున్నట్లు సీఎం ప్రకటించడంతో జిల్లాలో నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు వివిధ శాఖల్లో 1,465 పోస్టులు భర్తీ కానున్నాయి. జోన్, మల్టీ జోన్ పోస్టులు కూడా పెద్ద సంఖ్యలో రానున్నాయి. దీంతో అన్ని స్థాయిల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతీయువకులు సీఎం కేసీఆర్ ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. -కరీంనగర్, మార్చి 9 (నమస్తే తెలంగాణ)
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి. పైగా చిన్న జిల్లాల ఏర్పాటుతో జిల్లాలోని నిరుద్యోగులకు పెద్ద ప్రయోజనం చేకూరింది. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు అన్ని స్థాయిల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో జిల్లాకు 1,465 పోస్టులు దక్కాయి. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను జిల్లా, జోన్, మల్టీ జోన్ల వారీగా విభజించింది. నిరుద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల నుంచి నిరసనలు వచ్చినా ప్రభుత్వం పట్టుదలతో ఈ ప్రక్రియను పూర్తి చేసింది. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించింది. తాజాగా, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఇప్పుడు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు సైతం సమర్థిస్తున్నారు. ముఖ్యంగా స్థానికులకు 95 శాతం పోస్టులు కేటాయించడంతో జిల్లా స్థాయి పోస్టుల్లో తమకు న్యాయం జరుగుతుందని, ఉన్నచోటే ఉద్యోగం చేసుకోవచ్చని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని శాఖల్లో ఖాళీలు
జిల్లా క్యాడర్ పోస్టుల్లో దాదాపు అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హోం, సెకండరీ ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హయ్యర్ ఎడ్యుకేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్స్, రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల్లో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు జరిగింది. కరీంనగర్ జిల్లా నుంచి మూడు జిల్లాలకు ఉద్యోగులను విభజించారు. ఇలా స్థానికంగా పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. వివిధ శాఖల్లో 1,465 పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు అన్ని శాఖల్లో పోస్టులను భర్తీ చేసేందుకు ఒకేసారి నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో మొదటి రెండింటినీ సాధించుకుంటూనే అనేక శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వచ్చింది. తాజాగా, మరోసారి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అసెంబ్లీలో ప్రకటన చేశారు.
ఇక కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరు
అనేక అవస్థలు పడుతూ చాలీచాలని వేతనాలతో జీవితాలు గడుపుతున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. వారిని క్రమబద్ధీకరిస్తున్నట్లు, ఇక ముందు రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ అనేది ఉండదని ప్రకటించారు. దీంతో జిల్లాలోని 200ల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ వ్యవస్థ ద్వారా వివిధ శాఖల్లో ఉద్యోగంలో చేరిన వారు అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ హెల్త్, వైద్య విధాన పరిషత్తుల్లోనే కాంట్రాక్టు ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఈ ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వీరిని క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా జీవో 16ను తెచ్చారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టు కూడా కాంట్రాక్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పనిలో పనిగా సీఎం కేసీఆర్ వీరిని క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లాలోని అనేక మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది.