Trump – Machado | వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో అందజేసిన నోబెల్ శాంతి పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మచాడోకు కృతజ్ఞతలు చెప్పిన ట్రంప్.. ఈ చర్యను పరస్పర గౌరవానికి అద్భుత సంకేతంగా అభివర్ణించారు.
అమెరికాలోని వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో మచాడో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. అనంతం మీడియాతో మచాడో మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్‌నకు అందజేశానని తెలిపారు. కానీ ఆ పురస్కారాన్ని ట్రంప్ అందుకున్నారా? లేదా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే దీనిపై ట్రంప్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా స్పందించారు. మచాడోను కలవడం గొప్ప గౌరవంగా ఆయన భావిస్తున్నానని తెలిపారు. ఆమె చాలా గొప్ప మహిళ అని పొగిడారు. నేను చేస్తున్న పనికి గుర్తింపు ఆమె తనకు వచ్చి నోబెల్ శాంతి పురస్కారాన్ని నాకు సమర్పించారు అని వెల్లడించారు. ఇది పరస్పర గౌరవానికి అద్భుత సంకేతమని అభివర్ణించారు. మచాడోకు ధన్యవాదాలు తెలిపారు.

Trump Post
అంతకుముందు ట్రంప్‌తో భేటీ అనంతరం మచాడో మీడియాతో మాట్లాడుతూ.. నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్‌నకు అందజేశానని వెల్లడించారు. ఈ సందర్భంగా చారిత్రక ఘటనను ఉదాహరించారు. అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఫ్రెంచ్ సైనికాధికారి మార్క్విస్ డి లాఫాయెట్.. వెనెజువెలా విమోచకుడు సిమోన్ బొలివార్కు పతకం అందజేశారని గుర్తుచేశారు. రెండు శతాబ్దాల తర్వాత ఇప్పుడు బొలివార్ ప్రజలు వాషింగ్టన్ వారసుడిగా భావించే వ్యక్తికి ఈ పురస్కారాన్ని తిరిగి అందజేస్తున్నారని వ్యాఖ్యానించారు. వెనెజువెలా ప్రజల సంక్షేమం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తుగా తనకు వచ్చిన నోబెల్ శాంతి పురస్కారాన్ని అందజేశానని మచాడో తెలిపారు. వెనెజువెలా ప్రజల స్వేచ్ఛ సాధన కోసం ట్రంప్ చేస్తున్న కృషిపై తమకు విశ్వాసం ఉందని తెలిపారు. వెనెజువెలా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ఆయన అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం.. ఒకరికి వచ్చిన పురస్కారాన్ని మరొకరికి బదిలీ చేయడం, వేరొకరితో పంచుకోవడం కుదరదని నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. అయితే బహుమతిని వేరొరికి ఇవ్వచ్చని.. కానీ దానిపై విజేత పేరు శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతుందని స్పష్టం చేసింది.