విద్యానగర్, జనవరి 4 : జిల్లాలో కొవిడ్ నివారణకు పకడ్బందీ చర్యలు చేప ట్టాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, బెడ్స్, ఆక్సిజన్, మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అన్ని బెడ్లకు ఆక్సిజన్ సరఫరా ఉండాలని ఆదేశించారు. రెమిడీసి వర్ ఇంజక్షన్లు, మొల్నో పిర్నామిల్ టాబ్లెట్లు, ఇతర మందులు సిద్ధంగా ఉంచా లని ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన దవాఖానలో చిన్న పిల్లలకు 42 బెడ్లతో వార్డును సోమవారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొవిడ్ గర్భిణులకు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూ చించారు. జమ్మికుంట, హుజూరాబాద్ హాస్పిటళ్లలో కొవిడ్ వార్డులను సిద్ధంగా ఉంచాలని, అన్ని బెడ్లకు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని కొవిడ్ చికిత్సకు ఆమోదం పొందిన 68 ప్రైవేట్ వైద్యశాలల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని, కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో 24 గంటలు సిటీ సాన్, ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు చేయించాలని సూచించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తప్పకుండా ఎన్-95 మాసులు, గ్లౌసులు ధరించాలన్నారు.
మున్సిపల్ సిబ్బంది కూడా మాసులు ధరించాలని ఆదేశించారు. సిబ్బంది రెండు డోసుల కొవిడ్ టీకా తప్పకుండా తీసుకుని ఉండాలన్నారు. జిల్లాలో 15 నుంచి18 సంవత్సరాల వయస్సు గల వారు 64 వేల మంది ఉన్నట్లు గుర్తించామని, వారికి టీకా వేయించాలని ఆదేశించారు. 8 నుంచి పాఠశాల లకు సెలవులు ఉన్నందున 5, 6, 7 తేదీల్లో 10 వ తరగతి విద్యార్థులు, మాడల్ సూల్ విద్యార్థులు, కేజీబీవీ పాఠశాలలు 15- 18 సంవత్సరాల విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి టీకాలు వేయించాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు.
జిల్లాలో మొదటి డోస్ కొవిడ్ టీకా వందశాతం పూర్తి చేశామని, రెండో డోస్ టీకా 90 శాతం మందికి పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొవిడ్ బాధితులను ఐసోలేషన్లో ఉంచాలన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నందునా ప్రతి ఒకరు విధిగా డబుల్ మాసులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచుగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో లోకల్ బాడిస్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, మాతా శిశు సంరక్షణ కేంద్రం పరిపాలన అధికారి డాక్టర్ అలీం పాల్గొన్నారు.