కార్పొరేషన్, నవంబర్ 16: నగరంలో చౌరస్తాల సుందరీకరణపై బల్దియా ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేయగా… ప్రధాన చౌరస్తాలను కూడా సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని అంబేద్కర్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, కమాన్ చౌరస్తాను సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే, సుడా నిధులతో గాంధీ చౌరస్తాను అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ చౌక్‌లో స్మార్ట్‌సిటీ నిధులతో స్కై వాక్ తరహాలో సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మిగతా చౌరస్తాలను కూడా ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా స్మార్ట్‌సిటీ కింద నగరంలోని ఆర్ అండ్ బీ, నాకా చౌరస్తాలతో పాటు తెలంగాణ తల్లి చౌరస్తాను అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డిజైన్లకుతుది రూపు ఇచ్చారు.
రూ. 50 లక్షలతో సుందరీకరణ
నగరంలోని తెలంగాణ తల్లి చౌరస్తా, ఆర్ అండ్ బీ చౌరస్తా, నాకా చౌరస్తాను రూ. 50 లక్షలతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డిజైన్లు రూపొందించగా ఆ మేరకు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెలలోగా పూర్తిస్థాయిలో ఈ చౌరస్తాల అభివృద్ధి పనులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. వీటిలో గ్రీనరీ పెంచడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేలా వివిధ ఆకరాల్లో బొమ్మలను ఏర్పాటు చేయడంతో పాటు ఫౌంటేన్లు, ఇతర సుందరీకరణ పనులు చేపడుతున్నారు.
అన్ని చౌరస్తాల అభివృద్ధి
నగరంలోని ప్రధాన చౌరస్తాలన్నింటినీ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా నగర ప్రవేశ మార్గంలో ఉన్న చౌరస్తాలను ఆకర్షణీయంగా మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే అల్గునూర్ చౌరస్తాను దీక్ష స్థలి పేరిట అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు మానేరు నదిపై ఉన్న బ్రిడ్జి పక్కన మిషన్ భగీరథను సూచించే విధంగా పైలాన్ పనులు సాగుతున్నాయి. వీటితో పాటు ఎన్టీఆర్ చౌరస్తా సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రేకుర్తి, పద్మనగర్, బొమ్మకల్ వద్ద నగర ప్రవేశంలోని చౌరస్తాలను అత్యంత ఆకర్షణీయంగా తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ చౌరస్తాల అభివృద్ధికి సంబంధించిన అన్ని డిజైన్లను సిద్ధం చేసి పనులు త్వరలోనే చేపట్టనున్నట్లు బల్దియా అధికారవర్గాలు తెలిపాయి.