Modi | భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జకార్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ.. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ లోని టైటిల్ సాంగ్‌ను ప్రస్తావిస్తూ భారత్-ఇండోనేషియా సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఇండోనేషియాలో భారతీయ సంస్కృతికి మంచి ఆదరణ ఉందని పేర్కొన్న ప్రధాని మోదీ.. అక్కడ ‘కుచ్ కుచ్ హోతా హై’ పాట ఎంతో ప్రాచుర్యం పొందిందని చెప్పారు.
ఇండోనేషియాలో భారతదేశానికి చెందిన ‘కుచ్ కుచ్ హోతా హై’ పాట చాలా ప్రాచుర్యం పొందింది. భారత్, ఇండోనేషియా కలిసి ముందుకు సాగినప్పుడు మన ప్రయాణం కేవలం ‘కుచ్ కుచ్’ (కొంచెం కొంచెం) దగ్గరే ఆగిపోకుండా ‘బహుత్ కుచ్’ (చాలా ఎక్కువ) సాధించే దిశగా సాగాలి” అని వ్యాఖ్యానించారు.మోదీ చేసిన ఈ చమత్కార వ్యాఖ్యలకు సభలో చప్పట్లతో స్వాగతం లభించింది. ప్రధాని మోదీ తన సినిమాను ప్రస్తావించడంపై ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. జకార్తాలో మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా గురించి మాట్లాడటం ఎంతో ఆనందంగా, గర్వంగా అనిపించింది. ప్రేమకు సరిహద్దులు లేవని, అది అందరికీ అర్థమయ్యే భాష అని ఈ సందర్భం మరోసారి నిరూపించింది. మా సినిమాను, ఆ పాటను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు.
1998లో విడుదలైన ‘కుచ్ కుచ్ హోతా హై’ బాలీవుడ్లో ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. షారుఖ్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంగీతం, కథ, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఈ పాటను ప్రస్తావించడం, దానికి కరణ్ జోహార్ స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. అభిమానులు కూడా ఈ వీడియోలను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.