Kanta Rao | ఇటీవలి కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మనం చూస్తున్నాం. ఎవరైన ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా దివంగత నటుడు కాంతారావు కుమారుడు రాజేశ్వరరావుకి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ఇటీవల యండమూరికి రఘుపతి వెంకయ్య అవార్డు అందించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో ఓ లక్ష రూపాయలు తీసి కాంతారావు కుమారుడికి అందజేశారు యండమూరి.అయితే అవార్డ్ అందుకునే సమయంలోనే తాను ఈ బహుమతిలోని కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకి వినియోగిస్తానని చెప్పారు.
ఇందులో భాగంగా కడపకు చెందిన ఆర్తి ఫౌండేషన్‌కు రూ.3లక్షలు, శ్రీకాకుళంలో పేద, అనాథ విద్యార్థులకు సాయం చేసే అభయం ఫౌండేషన్‌కి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు.ఇక కాంతారావు కుమారుడి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన రాజాని తన ఇంటికి పిలిపించుకుని రూ.లక్ష చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కాంతారావు గారి పేరుమీద అవార్డు ఇస్తుందని తెలిసి ఫంక్షన్‌కి రమ్మని వారి కుటుంబానికి వెయ్యి రూపాయలు పంపాను. అయితే కాంతారావు గారి కుమారుడు ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడని తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే అవార్డ్ అందుకున్న వెంటనే ఇంటికి పిలిచి లక్ష అందించాను అని తెలిపారు.
సినిమాల్లో శత్రువులపై కత్తి దూసి తన అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించేవారు కాంతారావు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆయన చివరి దశలో అంతా పోగొట్టుకున్నారు. ఇక కాంతారావు చనిపోయాక కుటంబ పరిస్థితి దారుణంగా మారింది. గద్దర్ సినీ అవార్డుల సందర్భంగా టీఎస్ కాంతారావు పేరుతో అవార్డును హీరో విజయ్ దేవరకొండకి అందజేసిన విషయం తెలిసిందే.