పునీత్‌రాజ్‌కుమార్ కేవలం నటుడిగానే కాకుండా మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఆశ్రితులను ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ముఖ్యంగా ఆయన సేవాభావం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అంటారు. పునీత్‌రాజ్‌కుమార్ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 45 స్కూళ్లలో ఉచిత విద్యకు సహాయం అందజేస్తున్నారు. 26 అనాథ ఆశ్రమాలు, 20 వృద్ధాశ్రమాలకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. దాదాపు రెండు వేల మంది విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. పునీత్‌రాజ్‌కుమార్ సేవాతత్పరతను గుర్తుచేస్తూ ఆయన అభిమానులు చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి.
కన్నడ నాట చక్కటి శారీరకధారుడ్యం కలిగిన నటుడిగా ఆయనకు పేరుంది. తన ఫిట్నెస్ తాలూకు వీడియోలను ఆయన సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటుంటారు. ఎంత బిజీ షెడ్యూల్లో అయినా తాను వ్యాయామాన్ని మిస్ చేయనని పునీత్‌రాజ్‌కుమార్ చెబుతుండేవారు. క్రాస్‌ఫిట్, మార్షల్ ఆర్ట్స్‌తో పాటు యోగాను కూడా తన జీవితంలో ఓ భాగంగా చేసుకున్నానని ఆయన చెప్పేవారు. చక్కటి శరీరధారుడ్యంతో పాటు ఖచ్చితమైన ఆహార నియమాల్ని పాటించే పునీత్‌రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించడం ఆయన అభిమానులకు అంతుచిక్కని విషయంగా మారింది.