ఖలీల్‌వాడి మార్చి 14 : ఏది కల్తీ… ఏది స్వచ్ఛం, ఏది అసలు.. ఏది నకిలీ. ఏ వస్తువు కొన్నా ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతాయి. కష్టపడి కొనుగోలు చేసిన ప్రతి వస్తువు సరైన ధర, తూకం, నాణ్యత ఉండాలని వినియోగదారులు కోరుకుంటారు. కానీ, ప్రస్తుతం అంతటా మోసాలు పెరిగిపోయాయి. తాగే నీళ్లు, పాలు కూడా కల్తీ అవుతున్నాయి. తూకాల్లో భారీ తేడాలుంటున్నాయి. పలుచోట్ల ఎమ్మార్పీ కన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. వీటన్నింటిపై ఎవరిని ప్రశ్నించాలి, నిలదీయాలో చాలా మందికి అవగాహన లేదు. కొన్ని సందర్భాల్లో బాధితులు ధైర్యం చేసి పోరాడితే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాలి.. హక్కులపై అవగాహన పెంచుకొని తమని తాము రక్షించుకోవాలి. నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం…
ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన జరుపుకుంటాం. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసేవారు వినియోగదారులు. కొనుగోలుదారు అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకునేవారు సైతం వినియోగదారులే. ఈ నిర్వచనం ప్రకారం మన అందరం ఏదో ఒకరకంగా వినియోగదారులమే. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో నకిలీ వస్తువులు కూడా అధికమవుతున్నాయి. నకిలీ వస్తువులు, ఎమ్మార్పీ కన్నా అధికంగా విక్రయించడం లాంటి వాటిని అరికట్టేందుకు వినియోగదారుల సమాచార కేంద్రం కృషి చేస్తున్నది. 2021-22 సంవత్సరానికి ఇప్పటి వరకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో మొత్తం 6829 కేసులు నమోదు కాగా 6622 పరిష్కరించారు. ఇంకా 207 కేసులు పరిష్కరించాల్సి ఉంది. దీనిలో టూ విల్లర్, ఫోర్ విల్లర్, వాటర్ ఫిల్టర్, గ్యాస్, రేషన్, పెట్రోల్ దుకాణాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. మాల్స్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని , హోటల్స్‌లో నాసిరకం ఆహారం అందించడంపై ఫిర్యాదులు వచ్చాయి.
టోల్ ఫ్రీ నంబర్:
వినియోగదారులు తమకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్లవచ్చు. జాగో గ్రాహక్ జాగో హెల్ప్‌లైన్ నంబర్ 14404కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి సలహాలు పొందవచ్చు. వివరాలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉన్న వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయవార్ రాజేశ్వర్ (9396451999) నంబర్‌ను సంప్రదించవచ్చు.
ఇప్పటి వరకు 6829 ఫిర్యాదులు..
జిల్లాలో ఇప్పటి వరకు 6829 ఫిర్యాదులు వచ్చాయి. దానిలో గ్యాస్ కనెక్షన్స్, పెట్రోల్ బంకులు, చౌక దుకాణాలు, ఆటోమొబైల్స్, నాణ్యతలేని, నాసిరకం వస్తువులు, విత్తనాలు, ఎరువులు, ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. వాటిని వెంటనే పరిష్కరించాం. ప్రతి వస్తువును కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీదును తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే సమస్యను పరిష్కరించుకోవడానికి సులువు అవుతుంది.
– మయావర్ రాజేశ్వర్, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్ర చైర్మన్
వినియోగదారుల హక్కులు
భద్రత హక్కు : వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవలు తక్షణ అవసరాలు తీర్చేవిగానే కాకుండా దీర్ఘకాలంగా ఉండాలి. అని వినియోగదారుల ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ఈ భద్రత పొందడానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలి. వీలైనంత వరకు ఐఎస్ఐ, అగ్మార్క్, హాల్‌మార్క్ వంటి నాణ్యత చిహ్నాలు ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలి.
సమాచారం పొందే హక్కు : వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సే వల నాణ్యత ప్రమాణం, ధరల గురించి సంపూర్ణ సమాచారం పొందవచ్చు.
వస్తువుల ఎంపిక హక్కు : అనేక రకాల వస్తువులను, సేవలను తగిన సరసమైన ధరల్లో పొందడం వినియోగదారుల హక్కు.
న్యాయపోరాటం: అన్యాయమైన వాణిజ్య విధానాలను, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందడం వినియోగదారుల హక్కు.
బాధ్యతలు : గుడ్డిగా ఏ వస్తువూ కొనవద్దు. ముందు గా కొనదలచిన వస్తువు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఒక విభాగానికి చెందిన రెండు ప్యాకేజీలలో దేనిలో నెట్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్నాయో చూసికొనాలి. కాస్మోటిక్స్ ఉత్పత్తులపై తప్పనిసరిగా వస్తువు ధర తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువును సరి చూసుకోవాలి. మోసపూరిత ప్రకటనల విషయంలో జాగ్రత్త వహించాలి. నాణ్యమైన వస్తువులే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే సమయంలో సరైన రశీదు అడిగి తీసుకోవాలి. కొన్ని వస్తువుల విషయంలో గ్యారెంటీ, వారంటీ కార్డును షాప్ యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల ఫోరంలో (కోర్టులో) సమర్పించడానికి ఉపయోగపడతాయి. నాసిరకం వస్తువులను విక్రయించిన వారిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు.
నష్ట పరిహారం: నష్టపరిహారం రూ.20లక్షల విలువ వరకు జిల్లా వినియోగదారుల కమిషన్ ద్వారా కోటి వరకు, రాష్ట్ర కమిషన్‌లోను కోటి నుంచి రూ.10కోట్ల వరకు పొందవచ్చు. రూ. 10 కోట్లు దాటితే జాతీయ కమిషన్‌లో కేసులు వేసుకోవచ్చు.
ఫిర్యాదు చేయడం ఎలా..
ఫిర్యాదు చేసే విధానం చాలా సులువు. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. ఏ న్యాయవాది అవసరం లేకుండా, ఎవరైనా వినియోగదారుల సమాచార కేంద్రానికి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.