కమ్మర్పల్లి, మార్చి 13: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి.. రాష్ట్ర రోడ్లు-భవనలు, గృహ నిర్మాణ, శాసనసభావ్యవహారాల మంత్రి గా నియోజకవర్గానికి రోజంతా చెప్పుకున్నా ఒడవనంత అభివృద్ధి కార్యక్రమాలు అందించిన వేముల ప్రశాంత్‌రెడ్డి పుట్టినరోజు నేడు.
అభివృద్ధి ముద్ర..
సీఎం కేసీఆర్ సహకారంతో వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంపై బలమైన అభివృద్ధి ముద్ర వేశారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, విరివిగా ఎత్తిపోతల పథకాలు, మూడు కాలాలు నిండుకుండల్లా ఉంటూ పంటలకు తరగని సాగు నీటి వనరులుగా మారిన ఎస్సారెస్పీ కాకతీయ కాలువ, వరద కాలువ, కప్పల వాగు, పెద్ద వాగుల్లో అడుగడుగునా నిర్మిస్తున్న చెక్‌డ్యాంలు ఇందుకు నిదర్శనాలు. నియోజకవర్గంలో నూతనంగా ఎన్నో దేవాలయాలకు నిధులు మంజూరు చేయించి నిర్మించారు. ఎన్నో మసీదులు, దర్గాలు, చర్చిలకు నిధులు అందించారు. కోట్లాది రూపాయలతో రోడ్ల సమస్య అనేదే లేకుండా చేస్తున్నారు. అవసరమైన చోటల్లా వంతెనలు, బ్రిడ్జీలు నిర్మించారు. వేల్పూర్ మండలం రామన్నపేట్-వేల్పూర్, పచ్చలనడ్కుడ, మెండోరా, ఏర్గట్ల మండలాల్లోని పలు వాగులు, కాలువల మీద నిర్మించిన వంతెనలు, తాజాగా వేల్పూర్, మోతెలో చేపట్టిన వంతెనల నిర్మాణాలే ఇందుకు ఉదాహరణలు.
మనసున్న నేతగా..
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పెడుతూనే నాయకుడిగా తన ప్రజల కోసం మనసు నిండా పని చేస్తున్న నేతగా నిలిచారు. కొవిడ్ విపత్తు వేళ నియోజకవర్గంలో ఫ్రంట్ లైన్ సేవలు అందించిన వారికి, పొరుగు రాష్ర్టాలకు కాలినడకన మండుటెండల్లో వెళ్లిన వారికి అన్నదాతగా అండగా నిలిచారు. కరోనా ఉధృతి సమయంలో కండ్ల ముందు జరిగిన ధైన్యాలు, బాధాకర సన్నివేశాలు, ఆక్సిజన్ అందక ఆప్తులు, తన నియోజకవర్గ ప్రజలు, జిల్లా వాసులు ఊపిరి వదిలిన బాధాకర సందర్భాలు చూసిన వేముల ప్రశాంత్ రెడ్డి తన బాధ్యతను నెరవేర్చడంలో భిన్నమైన నాయకుడై నిలిచారు. తన ఆవేదనను సతీమణి నీరజారెడ్డితోపాటు తన మిత్రులతో పంచుకొని, వారు అందించిన రూ.కోటిన్నర ఆర్థిక సహాయంతో బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానలన్నింటినీ 102ఆక్సిజన్ బెడ్ల దవాఖానలుగా మార్చేశారు.
18 ఐసీయూ బెడ్లను సమకూర్చారు. అన్ని దవాఖానల్లో బెడ్లకు ఆక్సిజన్ అందించడానికి ఏకంగా నియోజకవర్గంలోనే ఆక్సిజన్ ప్లాంట్, బాట్లింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. ఇక మీదట దురదృష్టవశాత్తు విపత్తు వచ్చినా ఆక్సిజన్ దొరక్క ఏ ఒక్కరి శ్వాస ఆగకూడదనే ఆశయంతో..దవాఖానలకు తన ఆలోచనలతో ఊపిరిలూదారు. రూ.కోటిన్నరతో ఇలా కూడా చేయవచ్చు అనే ఊపిరి కార్యక్రమాన్ని ఇతరులూ చేసేలా ఆదర్శ శంఖారావం పూరించిన నేతగా వేముల ప్రశాంత్‌రెడ్డి నిలిచారు.