నిజాంసాగర్, మార్చి 13 : నిజాం కట్టడాలు చరిత్రకు ఆనవాళ్లని, వందేండ్ల క్రితం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరకుండా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పటి కట్టడం ఉమ్మడి జిల్లాకే అన్నపూర్ణగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. స్పీకర్, డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్టును ఆదివారం సందర్శించారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, మండలంలోని టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి ప్రాజెక్టు వద్ద కూర్చొని స్పీకర్ కొద్దిసేపు ముచ్చటించారు. తన చిన్నతనంలో ప్రాజెక్టును చూసేందుకు తరచూ వచ్చేవాడినని గత స్మృతులను నెమరేసుకున్నారు. అప్పట్లో నిజాం రాజులు ప్రాజెక్టును నిర్మిస్తే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ అపరభగీరథుడిలా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి అడుగంటుతున్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు జలకళను తీసుకువచ్చారని అన్నారు. అనంతరం గెస్ట్‌హౌస్, వరద గేట్లు, గోల్‌బంగ్లా ప్రాంతాలను సందర్శించారు. నాయకులు విఠల్, మనోహర్, రమేశ్‌గౌడ్, రమేశ్, చందర్, సంగమేశ్వర్‌గౌడ్, వాజిద్‌అలీ పాల్గొన్నారు.