మెండోరా/రెంజల్, మార్చి 1: మహారాష్ట్రలో ని ర్మించిన బాబ్లీప్రాజెక్టు నుంచి మంగళవారం ఉద యం దిగువకు నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏటా మార్చి ఒకటో తేదీన బాబ్లీ నుంచి దిగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి తాగునీటి అవసరాల కోసం 0.6టీఎంసీల నీటిని విడుదల చేయాలి. సీడబ్ల్యూసీ నుంచి ఈ ఈ శ్రీనివాస్‌రావు, నాందెడ్ ఈఈ ఏఎస్ చౌగలే, ఎస్సారెస్పీ ఈఈ సుకుమార్, ఏఈఈ మాణిక్యం, అధికారుల సమక్షంలో మంగళవారం ఉదయం బాబ్లీప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
బాబ్లీ నుంచి 0.6టీఎంసీల నీటిని విడుదల చేసి గేట్లు మూసివేసినట్లు ఎస్సారెస్పీ ఈఈ సుకుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి సంవ్సతరం కేంద్ర జలవనరుల సంఘం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో బాబ్లీప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటివిడుదల కొనసాగుతుందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1081.10 అడుగుల (55.52 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నదని తెలిపారు.
నిండుగా ప్రవహిస్తున్న త్రివేణి సంగమ క్షేత్రం
బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నది నిండుగా పారుతున్నది. త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి నిండుగా ప్రవహించడంతో భూగర్భ జలమ ట్టం పెరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.