ఉమ్మడి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. స్వామిని దర్శించుకొని పూజల్లో పాల్గొనేందుకు అర్ధరాత్రి వరకు భక్తులు బారులుతీరి కనిపించారు. పలు ఆలయాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పూజలు చేశారు. ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రంతా జాగరణ చేశారు. ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా శివపార్వతుల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిపించారు.