ఎల్లారెడ్డి రూరల్, మార్చి 1: పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ కోరారు. మంగళవారం ఉదయం ఆయన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పట్టణంలోని వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్‌కు చెందిన చెత్తను సేకరించే వాహనాలు ప్రతి రోజు పట్టణమంతా తిరుగుతున్నప్పటికీ కొంతమంది వ్యాపారులు చెత్తను తమ దుకాణాల ముందే పారబోస్తున్నారని అన్నారు. ఇకనుంచైనా చెత్తను మున్సిపల్ వాహనాల్లో మాత్రమే వేయాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉందని, దీంతో కొంతమేరకు ఇబ్బందులు అవుతున్నాయన్నారు. అయినా ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఎంతో కష్టపడి పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపడుతున్నారని తెలిపారు. పట్టణంలోని వీధులను కూడా శుభ్రంగా ఉంచాలని కార్మికులకు సూచించారు. పండుగల సమయంలో సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మున్సిపల్లో సిబ్బంది కొరత విషయాన్ని ఎమ్మెల్యే సహకారంతో మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మున్సిపల్ కార్యాలయంలో పనులు చేయడానికి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తనకు (9908540541) సమాచారం ఇవ్వాలని సూచించారు.