నిజామాబాద్ రూరల్, మార్చి 1 : విజయ డెయిరీకి పాలుపోసే పాడిరైతులకు చెల్లించే ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గతనెల ఫిబ్రవరి 16 నుంచే అమల్లోకి వస్తుందని సంస్థ జిల్లా మేనేజర్ రమేశ్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు సర్క్యులర్ తమ కార్యాలయానికి చేరిందన్నారు. పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లీటరు పాలకు రూ.4.68 పైసలను పెంచిందని తెలిపారు. పాల ధర పెంపుతో జిల్లాలో ప్రస్తుతం సరఫరా అవుతున్న 4,500 లీటర్లకు అదనంగా 400 లీటర్ల పాల సేకరణ పెరిగిందని తెలిపారు. ప్రతి నెలలో రెండు సార్లు పాల బిల్లును రైతులకు చెల్లిస్తామని, 1వ తేదీ నుంచి 15 వరకు పాలు పోసిన రైతులకు 16, 17న బిల్లులు చెల్లిస్తుండగా, 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు పాలు పోస్తున్న రైతులకు 1, 2వ తేదీల్లో బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు. జిల్లావ్యాప్తంగా 120 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలున్నాయని వాటి ద్వారా ప్రస్తుతం 4,900 లీటర్ల పాలను సేకరిస్తున్నామన్నారు. పాడిరైతులకు చెల్లించే పాల ధర పెంపుతో కేంద్రాల్లో పాల సేకరణ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాడి రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.