కామారెడ్డి/ కామారెడ్డి టౌన్/ నిజామాబాద్ సిటీ, నవంబర్ 18 : ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. నిజామాబాద్ జిల్లాలో బుధవారం వరకు 725 దరఖాస్తులురాగా, చివరి రోజైన గురువారం 900కు పైగా టెండర్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో 102 మద్యం దుకాణాలకు దరఖాస్తుల సంఖ్య 1600 దాటింది. గతేడాది కన్నా ఈసారి 300కు పైగా ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో 49 మద్యం షాపులకు భారీ సంఖ్యలో టెండర్లు దాఖలయ్యాయి. మొత్తం 960 దరఖాస్తులు రాగా, గురువారం ఒక్కరోజే 506 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో రిజర్వేషన్ కేటగిరీ కింద 14 దుకాణాలను కేటాయించారు. ఎస్టీలకు -2, ఎస్సీలకు -5, గౌడ్ కులస్తులకు ఏడు దుకాణాలను కేటాయించారు. ఓపెన్ కేటగిరీలో 35 దుకాణాలు ఉన్నాయి. ఒక్కో మద్యం దుకాణానికి పదుల సంఖ్యలో టెండర్లు దాఖలయ్యాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఎక్సైజ్ పరిధిలో పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. జిల్లా కేంద్రంలోని 6 దుకాణాలకు తీవ్ర పోటీ నెలకొంది.
జిల్లా కేంద్రంలో రేపు డ్రా
ఈ నెల 20 వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి డ్రాకు ఏర్పాటు చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రేణుకా దేవీ ఫంక్షన్ హాలులో డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 9గంటల వరకు హాజరుకావాలని, కలెక్టర్, అధికారుల సమక్షంలో డ్రాను నిర్వహించనున్నట్లు తెలిపారు.