పలకా బలపం పట్టుకున్న బడి.. ఓనమాలు దిద్దిన చదువుల తల్లి ఒడి.. విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చిన గుడిని ఆయన మరిచిపోలేదు. ఎంత ఎదిగినా ఇంకా ఒదిగే ఉన్నానంటూ తన మూలాలను మరువలేదు. శిథిలావస్థలో ఉన్న ఆ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. తల్లిదండ్రుల స్ఫూర్తితో చదువుకున్న పాఠశాలను దత్తత తీసుకొని అత్యాధునిక హంగులతో నిర్మించాడు. బడి రుణం తీర్చుకొని బీబీపేట గ్రామం గర్వపడేలా దాతృత్వాన్ని చాటుకున్నాడు తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి. సుమారు రూ.6.5కోట్లతో కార్పొరేట్ హంగులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రులు మంగళవారం ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..
కామారెడ్డి జిల్లా బీబీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా నిర్మించారు తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి. నిజాంకాలంలో ప్రారంభమైన బీబీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రభుత్వ నిధులతో మరమ్మతుల కోసం ఎదురుచూసే పరిస్థితులు. తాను చదివిన పాఠశాల శిథిలావస్థకు చేరిన విషయం తోటి విద్యార్థుల ద్వారా సుభాష్‌రెడ్డి తెలుసుకున్నాడు. పూర్వ విద్యార్థులందరూ కలిసి మార్గం ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని పాఠశాలకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తాను ఒక్కడినే పాఠశాలను నిర్మించి ఇస్తానని సుభాష్‌రెడ్డి ముందుకొచ్చాడు. 2020 నవంబర్ 30న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. తాను చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు పాత భవనాన్ని కూల్చేసి సుమారు రూ.6.5కోట్లతో మూడు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో నూతన భవనం నిర్మించాడు. ప్రస్తుతం పాఠశాలలో బీబీపేట, ఇస్సానగర్, ఉప్పర్‌పల్లి, యాడారం, జనగామ, మల్కాపూర్, షేర్‌బీబీపేట, తుజాల్పూర్ గ్రామాలకు చెందిన 653 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఎవరీ సుభాష్‌రెడ్డి..
బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి సుశీల – నారాయణ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు దుర్గారెడ్డి, సుభాష్ రెడ్డి. దుర్గారెడ్డి ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేస్తుండగా, సుభాష్‌రెడ్డి బిల్డర్, కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డారు. సుభాష్‌రెడ్డికి భార్య రజనీ, కుమారుడు నిహంత్రెడ్డి ఉన్నారు. సుభాష్‌రెడ్డి 1 నుంచి 7వ తరగతి వరకు పుట్టిన ఊరిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివారు. 8 నుంచి 10 తరగతి వరకు బీబీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. అనంతరం ఇంటర్మీడియట్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. అనంతరం ఇక్కడే బిల్డర్‌గా మారాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణించి హైదరాబాద్ చుట్టు పక్కల కెడాల్ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో విల్లాల నిర్మాణంలో వృద్ధి సాధించాడు. పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే తపనతో ముందుకొచ్చి జనగామలో 52, జంగంపల్లి గ్రామంలో 50 డబుల్ బెడ్రూం ఇండ్లను విల్లాలను తలపించేలా నిర్మించాడు. ప్రభుత్వ నిధులకు తోడు ఒక్కో ఇంటికి రూ. 3లక్షల సొంత నిధులు ఖర్చు చేసి నిర్మించి ఇచ్చాడు. బీబీపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.20లక్షల వ్యయంతో ఎల్ఈడీ లైట్లు, రూ.30లక్షలతో ఆలయాల అభివృద్ధికి తోడ్పాటునందించారు. చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో రూ.6.5కోట్లతో నూతన భవనాన్ని అందంగా నిర్మించి ఇచ్చాడు.
అబ్బురపరిచే సౌకర్యాలు..
బీబీపేట ఉన్నత పాఠశాలను అబ్బుర పరిచే సౌకర్యాలు, మౌలిక వసతులతో నిర్మించారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో 36 తరగతి గదులను నిర్మించారు. కార్పొరేట్ స్థాయిలో నాలుగు విశ్రాంతి గదులు, ఆరు వాష్ రూంలతోపాటు ఒకేసారి 300 మంది సమావేశమయ్యేలా కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేశారు. హెడ్ మాస్టర్‌కు, ఉపాధ్యాయులకు ప్రత్యేక గదులు నిర్మించారు. అధునాతన హంగులు, కప్బోర్డుతో కూడిన లైబ్రరీ ఏర్పాటు చేశారు.నాలుగు గదుల్లో సైన్స్, సోషల్, మ్యాథ్స్, కంప్యూటర్ ల్యాబ్ వసతులను కల్పించారు. 2వేల లీటర్లతో కూడిన ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించారు. విద్యార్థులందరూ ఒకేసారి మధ్యాహ్న భోజనం చేసేలా 3500 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో డైనింగ్ హాల్ నిర్మిస్తున్నారు. పాఠశాల ఆవరణలో సరస్వతీ దేవి విగ్రహం సిద్ధం చేశారు. గ్రానైట్ మార్బుల్స్‌తో కూడిన కారిడార్, బాల,బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. క్రీడామైదానంతోపాటు చుట్టూ పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను నాటారు.
9న ప్రారంభించనున్న మంత్రులు..
బీబీపేట మండల కేంద్రంలో తిమ్మయ్యగారి సుశీల-నారాయణరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 9న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అందరికీ విద్యనందించాలి..
ఇంటికి వచ్చిన వారందరికీ ఆదరించి అన్నం పెట్టడం మా తల్లిదండ్రులు నేర్పించారు. అన్నిరంగాల్లో ముందుండాలని మా నాన్న ఎప్పుడూ కోరేవారు. ఆయన ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగాను. నా కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఈ పనులను చేస్తున్నా. చదువుకోవాలని తపన ఉండి చదువుకోలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. అందరూ చదివి ప్ర యోజకులు కావాలనీ నా ఆకాంక్ష. చదువుకున్న పాఠశాలను తిరిగి పునర్నిర్మించడంపై సంతోషంగా ఉన్నది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచనలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్న.
మెరుగైన వసతులతో విద్యాబోధన
పాఠశాలలో చదివే విద్యార్థుల కు మెరుగైన వసతులతో కూడిన విద్యాబోధన అందించేలా సుభాష్‌రెడ్డి పాఠశాలను సిద్ధం చేయడం అభినందనీ యం. మాకు చాలా సంతోషంగా ఉంది. కోట్లాది రూపాయలను ఖర్చు చేసి పాఠశాలను నిర్మించి ఇవ్వడం దేవాలయం నిర్మించినట్టే.
మళ్లీ పాఠశాలలోచదవాలనిపిస్తున్నది..
కొత్తగా కట్టిన పాఠశాల చూడముచ్చటగా కనిపిస్తున్నది. చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. పాఠశాలలో మళ్లీ చదవాలనిపిస్తుంది. నేను 6 నుంచి 10 తరగతి వరకు ఇక్కడే చదివాను. ఇప్పుడు కట్టిన పాఠశాల బాగున్న ది. బీబీపేట పంచాయతీ పాలకవర్గం, పూర్వ విద్యార్థుల తరఫున సుభాష్‌రెడ్డికి అభినందనలు తెలుపుతున్నాం.